బాబుకు మోదీ రిటర్న్ గిఫ్ట్.. త్వరలోనే నారా లోకేష్‌‌కు ప్రమోషన్
 

by Suryaa Desk | Mon, Jun 23, 2025, 07:07 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను మోదీ ప్రశంసించారు. అలాగే నారా లోకేష్ యోగా డే వేడుకల కోసం చేసిన కృషిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి కీలక వ్యాఖ్యలు చేశారు. సమకాలీన రాజకీయ అంశాలను విశ్లేషించే ఆయన యోగా డే వేడుకలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.


అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో పాటుగా సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ సహా ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్షల మంది పాల్గొన్న విశాఖ యోగా డే వేడుకలు.. గిన్నిస్ రికార్డులకు ఎక్కాయి. అయితే విశాఖ యోగా డే కార్యక్రమం ద్వారా ఒకరికి సీఎం పదవీ యోగం పట్టబోతోందంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి. యోగా డే ద్వారా నారా లోకేష్‌కు సీఎం యోగం పట్టనుందని ఆయన అంచనా వేశారు. దీని వెనుక ఉన్న కారణాలను వివరిస్తూ తెలకపల్లి రవి మాట్లాడిన వీడియో చర్చనీయాంశంగా మారింది.


‘‘విశాఖపట్నం యోగా వేడుకల ద్వారా.. అందులో పాల్గొన్న వారందరికీ ఆయురారోగ్యాలు ఎంత మేరకు లభిస్తాయనేదీ పక్కనబెడితే.. తెలుగుదేశం వాళ్లు ఆశిస్తున్నట్లుగా టీడీపీ నేతగా ఆవిర్భవించబోతున్న నారా లోకేష్‌‍కు మాత్రం పూర్తిగా కలిసి వచ్చింది. యోగా డే ద్వారా నారా లోకేష్‌కు సీఎం పదవీ యోగం, పార్టీ నాయకత్వం యోగం ఆయన ముందు నిలిచాయి. విశాఖ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. లోకేష్ భాయ్, లోకేష్ భాయ్ అని అన్నిసార్లు అన్నారంటే అది మామూలు విషయం కాదు. సాధారణంగా మోదీ అలా అనరు. అన్ని రాష్ట్రాలలోని యువ నాయకత్వాన్ని, ప్రాంతీయ పార్టీల యువ నాయకులను మోదీ ప్రత్యేకంగా చేరదీస్తున్నారు. దీని ద్వారా యువ శ్రేణిని నరేంద్ర మోదీ నిర్మిస్తున్నారు.’’ అని తెలకపల్లి రవి వివరించారు.


అయితే నారా లోకేష్, బీజేపీ మైత్రి లోక్‌సభ ఎన్నికలకు ముందే ఏర్పడిందని తెలకపల్లి రవి చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ మైత్రి మరింత బలపడిందని అంటున్నారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అగ్రనాయకత్వం.. నారా లోకేష్‌తో లోక్‌సభ ఎన్నికలకు ముందే అనుసంధానం చేసుకున్నారు. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు.. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి సహాయంతో నారా లోకేష్.. అమిత్‌ షాను కలిశారు. అప్పటి నుంచి బీజేపీ, టీడీపీ సఖ్యత పెరిగింది. పవన్ కళ్యాణ్ పాత్ర కూడా టీడీపీ, బీజేపీ జనసేన పొత్తులో ఉంది. కానీ.. టీడీపీ, బీజేపీ పొత్తులో కీలక పాత్రధారి ఎవరంటే నారా లోకేషే. " అని తెలకపల్లి రవి అన్నారు.


‘‘ఎన్నికలు పూర్తైన తర్వాత అక్టోబర్ నెలలో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్‌లో నారా లోకేష్ ఓ మాట చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో 22 సీట్లు ఇస్తానని మోదీకి చెప్పానని.. కానీ ఒక్క సీటు తగ్గిందని, అందుకు సారీ చెప్తున్నానని నారా లోకేష్ ఆ రోజు అన్నారు. దీని ప్రకారం వారి మధ్య అవగాహన ఎలా ఉందో తెలుస్తుంది. అలాగే నరేంద్ర మోదీ అమరావతికి వచ్చినప్పుడు, విశాఖపట్నానికి వచ్చినప్పుడు కూడా నారా లోకేష్‌ను.. ఢిల్లీ వచ్చి నన్నెందుకు కలవడం లేదంటూ చాలాసార్లు అన్నారు. మే నెలాఖరులో నారా లోకేష్ కుటుంబసమేతంగా ఢిల్లీ వెళ్లి మోదీని ఆయన ఇంట్లో కలిశారు. ఇదంతా మర్యాదపూర్వకంగా కనిపించినా.. అంతకుమించిన రాజకీయ సంకేతం అందులో ఉంది.’’


‘‘యోగా కార్యక్రమంలో నారా లోకేష్ కీలకంగా ఉన్నారు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కువగా లేదు. విశాఖపట్నంలో జరిగిన యోగా వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని.. నారా లోకేష్‌ను అభినందించిన తర్వాత నారా లోకేష్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. విశాఖ యోగా డే వేడుకలు గిన్నిస్ రికార్డులకు ఎక్కటంతో మరింత పెరిగింది. దీంతో ప్రధాని మోదీకి ఈ గిన్నిస్ రికార్డు తమ గిఫ్టు అంటూ టీడీపీ చెప్తోంది. అటు మోదీ నుంచి రిటర్న్ గిఫ్టు ఏంటంటే.. నారా లోకేష్‌ పట్టాభిషేకానికి రంగం సిద్ధం చేయడమే. నారా లోకేష్‌ను ఎప్పుడైనా సీఎం చేసుకోవచ్చు.. మాకేమీ అభ్యంతరం లేదని ప్రధాని మోదీ, అమిత్ షా పచ్చజెండా ఊపారని.. విశాఖపట్నంలో నారా లోకేష్‌కు మోదీ అభినందనలే ఆశీర్వాదాలని అనుకోవచ్చు’’ అని తెలకపల్లి రవి అభిప్రాయపడ్డారు.


మరోవైపు కడప మహానాడు ద్వారా నారా లోకేష్‌కు ఎలివేషన్ వచ్చిందన్న తెలకపల్లి రవి.. ఇక డిక్లరేషన్ మాత్రమే మిగిలిందని అన్నారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మీ పార్టీ, మీ ఇష్టం అన్నట్లుగానే ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు పాత్ర వేరు. ఎన్నికల తర్వాత వేరు. నారా లోకేష్ పట్టాభిషేకానికి రంగం పూర్తిగా సిద్ధమైంది అంటూ తెలకపల్లి రవి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


అయితే ఆ మధ్య శాసన సభ్యులకు నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు వేడుకల సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు మరో 15 ఏళ్లు సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. లోకేష్ సైతం తన తండ్రే సీఎంగా కొనసాగుతారని చాలా సార్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు సీఎం అయినప్పటికీ.. తెర వెనుక లోకేష్ చాలా వ్యవహారాలు చక్కబెడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


అసలు ఏపీ ప్రజలు కూటమి వైపు మొగ్గిందే బాబు అనుభవం చూసి. కొడుక్కి సీఎం పగ్గాలు అప్పగిస్తే.. తర్వాత చంద్రబాబు ఏం చేస్తారు? కూటమి సర్కారు ఇటీవలే ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. అంటే హనీమూన్ ముగిసింది. రాబోయే మూడేళ్లు ప్రభుత్వానికి ఎంతో కీలకం. రెండోసారి అధికారంలోకి రావాలంటే సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించడం కూటమికి ఎంతో అవసరం. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. మరోవైపు జగన్ అదును కోసం కాచుకొని కూర్చొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్‌ను సీఎంగా ప్రమోట్ చేస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM