|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 05:23 PM
అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి తాను చేసిన దారుణమైన వ్యాఖ్యలు సరికాదని, అది తాను చేసిన తప్పేనని జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజు అంగీకరించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అమరావతి అక్కాచెల్లెమ్మలకు క్షమాపణ చెబుతూ ఒక వీడియోను విడుదల చేస్తానని పోలీసుల విచారణలో ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి ఏ1 నిందితుడిగా ఉన్న కృష్ణంరాజు పోలీసు కస్టడీ నిన్నటితో ముగిసింది. మూడు రోజుల కస్టడీలో భాగంగా చివరి రోజైన నిన్న, తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో అధికారులు ఆయన్ను విచారించారు. కస్టడీ గడువు పూర్తికావడంతో ఈరోజు ఆయన్ను మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచి, అనంతరం జైలుకు పంపనున్నారు. రాజధాని ప్రాంత మహిళల పట్ల ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారని పోలీసులు ప్రశ్నించగా.. తాను తప్పు చేశానని, మహిళల పట్ల ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదని ఆయన అంగీకరించినట్లు తెలిసింది.
Latest News