రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన..వైఎస్ జగన్
 

by Suryaa Desk | Mon, Jun 23, 2025, 05:17 PM

పల్నాడులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా రెంటపాళ్లలో ఆయన కారు కింద పడి లింగయ్య అనే పార్టీ కార్యకర్త చనిపోవడం, దీన్ని తొలుత పోలీసులు మరో వైసీపీ నేత కారుగా ప్రకటించడం, ఆ తర్వాత వీడియోలు లభించడంతో కేసును మార్చడం జరిగింది. ఈ కేసులో కారు డ్రైవర్ రమణారెడ్డిని ఏ1గా, జగన్ ను ఏ2గా, మాజీ మంత్రులు పేర్నినాని, విడదల రజనీ, జగన్ పీఏ నాగేశ్వర్ రెడ్డిని సైతం నిందితులుగా చేర్చారు. దీనిపై ఇవాళ జగన్ తొలిసారి స్పందించారు. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు చంద్రబాబు అంటూ ఎక్స్ లో జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని ఎందుకు కట్టడి చేశారు? గతంలో మీరుకాని, మీ పవన్‌కళ్యాణ్‌ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? అని జగన్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా తాను వైసీపీ కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా, ఆటోమేటిక్‌ హక్కు కాదా? మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే, మూడ్‌ రానప్పుడు మేం మీకు జడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా? అని జగన్ ప్రశ్నించారు. జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారని, అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు అయినా జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను ఫాలో అయ్యి, ఆమేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలని గుర్తుచేశారు. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్‌ అన్నారు. మరి జడ్‌ప్లస్‌ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే, తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్‌మ్యాప్‌ ఇచ్చిన తర్వాత, పైలట్‌ వెహికల్స్‌, రోప్‌ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమైనప్పుడు, మరి మీ రోప్‌ పార్టీల, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్‌పట్టుకుని, ఎవ్వరూ వాహనంమీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? మనుషుల తాకిడి ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య అని అడిగారు. అందుకే కదా జడ్‌ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో, ప్రొటోకాల్‌లో భాగంగా ఈ రోప్‌ పార్టీని, పైలట్‌ వాహనాలను పెట్టడానికి కారణం అని తెలిపారు. మరి మీ పైలట్‌ వెహికల్స్‌, అందులో సెక్యూరిటీ, రోప్‌పార్టీలను జడ్‌ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు, ఎందుకు లేరని ప్రశ్నించారు. ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్‌ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా, లేక వెహికల్‌ కింద ఎవరూ పడలేదన్నదా? అని అడిగారు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్‌ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలని, గవర్నమెంట్‌ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్‌కూడా చేయాలని, ఇది ప్రొటోకాల్‌ అని జగన్ గుర్తుచేశారు. మంచి బుల్లెట్ ప్రూఫ్‌ వెహికల్‌ మీరు ప్రొవైడ్‌ చెయ్యకపోతే, గవర్నమెంటు అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టానన్నారు. డ్రైవర్‌ను మీరు (గవర్నమెంటు) ప్రొటోకాల్‌ ప్రకారం ఇచ్చారని, మరి మీ గవర్నమెంటు డ్రైవర్ తోలుతున్న ఈవెహికల్‌, మీరు ఇచ్చిన పైలట్‌ వెహికల్స్, మీ రోప్‌ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రొటోకాల్‌ అన్నారు. ఆరోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఏమిటి? మరి ఎందుకు ఈ టాపిక్‌ డైవర్షన్‌ రాజకీయాలని ప్రశ్నించారు. ప్రతిపక్షంగా తాను ప్రెస్‌మీట్‌ పెట్టి, సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పినమాటలు, గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే, మీ పాలనా వైఫల్యాలను, రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్‌పోజ్‌ చేస్తే, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్క చెల్లెమ్మలు, పిల్లల బ్రతుకులు, వీటన్నింటినీ తాను చెబితే, వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నా మీద ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు దిగజారి డైవర్షన్‌ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరమ్నారు. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారాలని సూచించారు. ఒక్కటి మాత్రం నిజం. తాను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి, తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని తన పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకు వచ్చారని జగన్ తెలిపారు. వెంటనే ప్రత్తిపాడు మా పార్టీ ఇన్‌ఛార్జి బాలసాని కిరణ్‌, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని వాళ్లు చెప్పారన్నారు. వెంటనే తాను స్పందించి మరుసటి రోజుకూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10లక్షల ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు ఇచ్చానన్నారు. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను తాము నిర్వర్తించామని, అందులోనూ మరణించిన ఆ వ్యక్తి తమ మనిషి అని, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుందన్నారు. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించామన్నారు. అయినా మా మీద విషప్రచారాలు చేస్తున్నారన్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం అన్నారు. అయినా మీ పర్యటనల సమయంలో, మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారని ప్రశ్నించారు. ఎంత చేశారని, ఎంత మేర చేశారని అడిగారు. మీరా మానవత్వం గురించి, నైతికత గురించి మాట్లాడేదన్నారు. ఇప్పటికైనా మారాలన్నారు.


 

Latest News
Adani Group's Jaypee plan gets NCLAT nod, Vedanta plea dismissed Mon, May 04, 2026, 12:09 PM
Gujarat bypoll: BJP's Harshad Parmar widens lead in Umreth as counting progresses Mon, May 04, 2026, 12:07 PM
Kerala results: Celebrations erupt at Cong office as UDF heads for victory Mon, May 04, 2026, 12:00 PM
US launches 'Project Freedom' in Strait of Hormuz to free stranded ships Mon, May 04, 2026, 11:56 AM
'On our way to clear mandate': Congress celebrates as UDF takes significant lead in Kerala Mon, May 04, 2026, 11:51 AM