|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 04:31 PM
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో రేషన్ దుకాణం వద్ద తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. నెలవారీ ఆహార ధాన్యాల కోసం గంటల తరబడి వేచిచూసిన ప్రజలు, తీవ్ర అసహనంతో దుకాణం ప్రధాన గేటును బద్దలగొట్టారు. దీంతో అక్కడ తొక్కిసలాట వంటి పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లావ్యాప్తంగా రేషన్ కేంద్రాల వద్ద లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. అయితే, పదేపదే తలెత్తుతున్న సాంకేతిక లోపాలు, సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అనేక దుకాణాల వద్ద తీవ్రమైన నిర్వహణ లోపాలు కనిపిస్తున్నాయి.నిన్న సేల్స్‌మ్యాన్ దుకాణం లోపల ఉన్నప్పటికీ గంటల తరబడి షాపును మూసివేయడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. దీంతో సహనం కోల్పోయిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు, రేషన్ షాపు ఇనుప గేటును బలవంతంగా తెరిచారు. ఒక్కసారిగా జనం లోపలికి దూసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు కిందపడిపోగా, వారికి స్వల్ప గాయాలయ్యాయి.ఇలాంటి గందరగోళం జరగడం ఇదే మొదటిసారి కాదని స్థానికులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా ప్రజలు ఉదయాన్నే లైన్లలో నిలబడుతున్నా, సాంకేతిక సమస్యల కారణంగా ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వస్తోందని వాపోయారు. "ఓటీపీ వెరిఫికేషన్‌లో వైఫల్యం, వేలిముద్రలు సరిపోలకపోవడం, పదేపదే సర్వర్ డౌన్ కావడం ప్రధాన సమస్యలు" అని స్థానికుడు ఒకరు తెలిపారు. రోజుకు 20 నుంచి 25 మందికి మాత్రమే రేషన్ అందుతోందని అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News