|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 04:24 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 2026 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన ప్రస్తుతం ఆ దేశంలో వివాదాస్పదంగా మారింది. ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో, ట్రంప్‌కు నోబెల్ పురస్కారం ఇవ్వాలన్న నిర్ణయాన్ని తక్షణమే పునఃసమీక్షించాలని పాకిస్థాన్‌లోని ప్రతిపక్షాలు షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ చర్యతో పాకిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయంగా నవ్వులపాలైందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి పురస్కారానికి పాకిస్థాన్ నామినేట్ చేసిన మరుసటి రోజే ఆయన ఇరాన్‌పై దాడులకు ఆదేశించడం చర్చనీయాంశమైంది. పలు దేశాలు ట్రంప్ చర్యలను తీవ్రంగా ఖండించాయి. ఈ పరిణామం పాకిస్థాన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.ప్రతిపక్షమైన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి చెందిన శాసనసభ్యుడు అలీ ముహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో తమ దేశం ఇరాన్‌కే మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్‌పై దాడులకు పాల్పడిన వ్యక్తికి నోబెల్ బహుమతి ప్రతిపాదించడం ద్వారా ట్రంప్, పాకిస్థాన్ ప్రభుత్వాన్ని సిగ్గుపడేలా చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షరీఫ్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Latest News