మూడు ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు
 

by Suryaa Desk | Sun, Jun 22, 2025, 10:09 PM

ప్రపంచం భయపడినట్టే జరిగింది. ఇరాన్-ఇజ్రాయేల్‌ యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా తాజాగా ఎంట్రీ ఇచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్‌పై అమెరికా సేనలు దాడులు చేపట్టాయి. B-2 స్పిరిట్ బాంబర్లు ఇరాన్‌లోని అణు కేంద్రాలపై విరుచుకుపడ్డాయి. ఇరాన్‌కు చెందిన ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణు కేంద్రాలపై భారీ దాడులు జరిగాయి. రెండు వారాల్లో దాడి చేస్తామని చెప్పిన ట్రంప్, రెండు రోజుల్లోనే దాడికి పాల్పడటం గమనార్హం. ఇజ్రాయేల్ వైమానిక దళంతో కలిసి ఈ దాడి చేసినట్లు ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు.


.ఇజ్రాయేల్ పక్షాన యుద్ధంలో చేరాలా వద్దా అన్న నిర్ణయాన్ని రెండు వారాల్లోగా తీసుకుంటానని ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ, శనివారం రాత్రి అకస్మాత్తుగా అమెరికా విమానాలు ఇరాన్‌లోని అణు కేంద్రాలపై భారీ బాంబుల దాడులు చేశాయంటూ ప్రకటించారు. ‘ఇరాన్‌కు చెందిన ఫోర్డో, నంతాంజ్, ఎస్‌ఫహన్ అణు కేంద్రాలపై మేము ఒక విజయవంతమైన దాడిని ముగించాం.. అన్నీ విమానాలు ఇప్పుడు ఇరాన్ గగనతలం నుంచి సురక్షితంగా వెనక్కి వచ్చాయి.. ఫోర్డో కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది.. మా ప్రతి పైలట్ ఇప్పుడు సురక్షితంగా తిరిగి వస్తున్నారు.. అమెరికా యోధులకు అభినందనలు. ప్రపంచంలో ఏ ఆర్మీకి ఇది సాధ్యం కాదు.. ఇప్పుడు శాంతికి సమయం వచ్చింది!" అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు.


అలాగే స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగం చేయనున్నట్ుట వెల్లడించారు. ఈ ప్రసంగంలో ‘ విజయవంతమైన యుద్ధ కార్యాచరణ’పై దేశ ప్రజలకు వివరణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ‘ఇది అమెరికా, ఇజ్రాయేల్, ప్రపంచానికి చారిత్రాత్మక క్షణం. ఇప్పుడు ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు అంగీకరించాలి’ అని ట్రంప్ పేర్కొన్నారు. యుద్దంలోకి అమెరికా దిగడంతో ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికే యుద్ధంలో జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికాను ఇరాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే.


కాగా, అమెరికాలోని వైట్‌మన్ ఎయిర్ బేస్ నుంచి మరిన్ని B-2 స్పిరిట్‌ బాంబర్లు బయలుదేరాయి. వాటితో పాటు ఎనిమిది కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్లు కూడా ఇండో-పసిఫిక్‌లోని డియాగో గార్సియాకు వెళ్లాయి. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం, ఈ విమానాలు మైటీ11, మైటీ21 అనే కాల్‌సైన్‌లు వాడాయి. గతంలో కూడా B-2 స్పిరిట్‌లు ప్రత్యేక ఆపరేషన్ల కోసం బయలుదేరినప్పుడు ‘మైటీ’ కాల్‌సైన్‌లను ఉపయోగించాయి.


ఈ దాడితో అమెరికా యుద్ధంలోకి దిగినట్టయింది. ప్రస్తుతానికి అదనపు దాడులు చేసే ఉద్దేశం లేదని సీఎన్‌ఎన్ పత్రిక పేర్కొంది. ఇజ్రాయేల్ అధికారులు అమెరికాకు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు. ఇస్ఫహాన్‌ డిప్యూటీ గవర్నర్‌ అక్బర్‌ సలేహి కూడా దాడిని ధ్రువీకరించారు. ఇస్ఫహాన్‌, నతాంజ్‌ వద్ద పేలుళ్లు జరిగాయని ఆయన చెప్పారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం రహస్య సొరంగంలో దాక్కుున్నట్టు తెలుస్తోంది.


కాగా, ఫోర్డో అణు కేంద్రం క్వామ్‌ నగరానికి దగ్గరలో ఉంది. అక్కడ ప్రజలు పేలుళ్ల శబ్దాలు విన్నట్లు చెప్పారు. ఈ అణు కేంద్రం ఇరాన్‌కు చాలా ముఖ్యమైనది. దీన్ని పర్వతం లోపల, కొన్ని వందల అడుగుల లోతులో నిర్మించారు. 1981లో బాగ్దాద్‌లో ఇజ్రాయేల్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని నిర్మించారు. 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్‌స్పెక్టర్లు ఇక్కడ 83.7 శాతం శుద్ధి చేసిన యురేనియంను గుర్తించారు. ఇది అణుబాంబుల్లో వాడే 90 శాతం శుద్ధి చేసిన యురేనియంకు దగ్గరగా ఉంది. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసింది. కాబట్టి ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం.


Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM