|
|
by Suryaa Desk | Sun, Jun 22, 2025, 09:04 PM
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రం.. శ్రీశైలం మల్లిఖార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. శివరాత్రి వంటి ప్రత్యేక పర్వదినాల వేళ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. వీకెండ్, పండుగల వేళ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనానికి తరలి వస్తుంటారు. అయితే గత కొన్ని నెలలుగా శ్రీశైలం భక్తులను ఓ సమస్య వెంటాడుతుంది. కానీ దీనిపై సంబంధిత కంపెనీలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు భక్తులకు వచ్చిన ఆ కొత్త కష్టం ఏంటి అంటే..
శ్రీశైల మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు మొబైల్ సిగ్నల్ కష్టాలు పెద్ద తలనొప్పిగా మారాయి. సెల్ వినియోగం పెరిగాక.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు కాల్ చేయకపోయినా.. వారికి కాల్ కలవకపోయినా.. ఆందోళన మొదలవుతుంది. మొబైల్ రింగ్ అయ్యి ఎత్తకపోతే అంత టెన్షన్ ఉండదు. కానీ అసలు కాల్ కనెక్ట్ కాకపోతే.. అబ్బో చాలా కంగారు పడాల్సి వస్తుంది. శ్రీశైలం దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. గత మూడు నెలలుగా శ్రీశైలం ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ సరిగా రావడంలేదు.
ఈ సమస్యపై ఇప్పటికే ఎందరో భక్తులు ఫిర్యాదు చేసినా.. ఈ రెండు టెలికాం సంస్థలు మాత్రం బెల్లం కొట్టిన రాయిలా స్పందించకుండా ఉన్నాయి. శ్రీశైలం వెళ్లే భక్తుల్లో చాలా మందితో పాటుగా.. అక్కడే నివాసం ఉండే స్థానికుల్లో చాలా మంది కూడా ఎయిర్‌టెల్, జియో సిమ్‌లు వాడుతున్నారు. కానీ శ్రీశైలం ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ తప్ప మిగతా సిగ్నల్స్ ఏవి కూడా సరిగా రావడం లేదు. మూడు నెలల నుంచి ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో శ్రీశైలంకు వచ్చిన భక్తులు సిగ్నల్స్ లేక.. తమ కుటుంబీకులు ఎక్కడ వున్నారో, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఎయిర్‌టెల్, జియో సంస్థలు మెరుగైన సేవలు అందించాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. మరి ఈ సమస్యపై ఆయా సంస్థలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.
Latest News