|
|
by Suryaa Desk | Sun, Jun 22, 2025, 07:34 PM
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణానికి చెందిన తేజేశ్వర్ సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. తేజేశ్వర్‌కు సుమారుగా నెల రోజుల కిందటే పెళ్లి జరిగింది. అయితే జూన్ 17 నుంచి తేజేశ్వర్ కనిపించకుండా పోయారు. దీంతో అతని కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. గద్వాల పోలీస్ స్టేషన్‌లో తేజేశ్వర్ కనిపించడం లేదంటూ తేజేశ్వర్ సోదరుడు ఫిర్యాదు చేశారు. దీంతో గద్వాల పోలీసులు తేజేశ్వర్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలోనే శనివారం గద్వాల పోలీసులు కర్నూలుకు వచ్చారు. కర్నూలు పోలీసుల సహకారంతో తేజేశ్వర్ మొబైల్ ఫోన్ సిగ్నల్ లొకేషన్ ట్రేస్ చేశారు. ఈ క్రమంలోనే పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు వద్ద తేజేశ్వర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు తేజేశ్వర్‌కు ఇటీవలే పెళ్లి జరిగింది. కర్నూలు జిల్లాకు చెందిన యువతిని తేజేశ్వర్ ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. అయితే యువతి తల్లికి, కర్నూలులో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న తిరుమలరావు అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. యువతి తల్లి ఆ బ్యాంకులో చిరుద్యోగి. ఈ క్రమంలోనే ఆమెకు, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుకు సంబంధం ఏర్పడినట్లు తెలిసింది. అయితే తేజేశ్వర్ యువతిని ప్రేమ పెళ్లి చేసుకోవటం.. ఆ యువతి తల్లికి, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుకు నచ్చలేదు. ఈ క్రమంలోనే తేజేశ్వర్‌ను ఇద్దరు కలిసి ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరితో పాటుగా మరికొందరి ప్రమేయం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు.
భూమి సర్వే ఉందని తెలిసిన వారితో తేజేశ్వర్‌కు ఫోన్ చేసి రప్పించారని.. అలా నమ్మి వచ్చిన తేజేశ్వర్‌ను బ్యాంకు మేనేజర్ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అనంతరం పిన్నాపురం చెరువు సమీపంలో పాతిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పెళ్లైన నెల రోజులకే ఇలా వరుడు అనుకోని రీతిలో చనిపోవటంతో.. అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు తన సోదరుడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేజేశ్వర్ సోదరుడు కోరుతున్నారు.