|
|
by Suryaa Desk | Sun, Jun 22, 2025, 04:12 PM
కెనడా క్రికెట్ జట్టు 2026 టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. అమెరికాస్ క్వాలిఫైయర్‌లో శనివారం కింగ్ సిటీలో జరిగిన మ్యాచ్‌లో బహామాస్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కెనడా, పొట్టి ప్రపంచ కప్‌కు రెండోసారి బెర్త్ ఖరారు చేసుకుంది. ఐదు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన కెనడా, ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆధిపత్యం చెలాయించింది.
మొదట బ్యాటింగ్ చేసిన బహామాస్‌ను కెనడా బౌలర్లు 57 పరుగులకే కట్టడి చేశారు. కలీం సానా, శివమ్ శర్మ తలో మూడు వికెట్లు, అన్షూ పటేల్ రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కెనడా కేవలం 5.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. దిల్‌ప్రీత్ బజ్వా (36 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను సునాయాసంగా ముగించాడు.
2026 టీ20 వరల్డ్‌కప్‌లో 20 జట్లు పోటీపడనున్నాయి. ఇప్పటికే భారత్, శ్రీలంక (ఆతిథ్య దేశాలు), ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ నేరుగా అర్హత సాధించగా, కెనడా 13వ జట్టుగా చేరింది. మిగిలిన 8 బెర్త్‌లు రీజియనల్ క్వాలిఫైయర్‌ల ద్వారా భర్తీ కానున్నాయి.