|
|
by Suryaa Desk | Sun, Jun 22, 2025, 04:10 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'హనీమూన్ హత్య' కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజాగా ఈ కేసులో ఇందౌర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి షిలోమ్ జేమ్స్‌ను అరెస్టు చేసినట్లు మేఘాలయ పోలీసులు తెలిపారు. రాజా రఘువంశీ హత్యకు సంబంధించిన కీలక ఆధారాలను దాచడంతో ఆ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ''రఘువంశీ హత్య తర్వాత మే 25-27 మధ్య సోనమ్ రైలులో ఇందౌర్‌కు వచ్చింది. అక్కడే తన ప్రియుడు రాజ్ కుశ్వాహాను కలుసుకుంది. అనంతరం ఇందౌర్‌లో రియల్ ఏస్టేట్ వ్యాపారి జేమ్స్ వద్ద రాజ్ కుశ్వాహా ఓ గదిని అద్దెకు తీసుకొని కొన్ని రోజుల పాటు సోనమ్‌ను దాచిపెట్టాడు. ఈ విషయంపై జేమ్స్‌ను మొదట పోలీసులు ప్రశ్నించగా.. రూ.17,000 కట్టి రాజ్ కుశ్వాహా ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడని తెలిపాడు. వారు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత గదిలో ఎటువంటి వస్తువులు దొరకలేదు అని కూడా చెప్పాడు. అయితే దర్యాప్తులో రఘువంశీ హత్యకు ఉపయోగించిన కీలక ఆధారాలు ఉన్న బ్యాగ్‌ను సోనమ్ అద్దె గదికి తీసుకువచ్చినట్లు తేలింది. ఆ బ్యాగును జేమ్స్ ఎవరికీ కనిపించకుండా దాచాడని కూడా స్పష్టమైంది. అంతేకాదు ఆ గదిని రాజ్ కుశ్వాహా అద్దెకు తీసుకోలేదని, ఈ కేసులో అరెస్టైన మరో నిందితుడు విశాల్ చౌహాన్ అద్దెకు తీసుకున్నాడని తెలిసింది. అతడితో జేమ్స్‌కు పరిచయం ఉంది'' అని మేఘాలయ పోలీసులు తెలిపారు. మే 11న రాజా రఘువంశీతో సోనమ్‌కి వివాహం జరగ్గా.. 20న హనీమూన్ కోసం మేఘాలయాకు వెళ్లారు. అనంతరం అదృశ్యమయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తుండగా.. 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోయలో పోలీసులు గుర్తించారు. అనంతరం సోనమ్ కోసం గాలించగా.. ఉన్నట్టుండి ఆమె ఘాజీపుర్‌లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలసి ఆమే భర్తను హత్య చేసినట్లు విచారణలో తేలింది. దీంతో వారిద్దరిని, వారికి సహకరించిన ఇందౌర్‌కు చెందిన విశాల్ సింగ్ చౌహాన్ (22), రాజ్ సింగ్ కుశ్వాహా (21), ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌కు చెందిన ఆకాశ్ రాజ్‌పూత్ (19)లను పోలీసులు అరెస్టు చేశారు.
Latest News