|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 11:22 PM
కొన్నిసార్లు ఊహించని ఖర్చులు ఎదురైనప్పుడు క్రెడిట్ కార్డులు ఆదుకుంటాయి. డబ్బులు అందుబాటులో లేని సమయంలో క్రెడిట్ కార్డు లను ఉపయోగించి ఆర్థికంగా ఎలా రక్షణ పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్రెడిట్ కార్డు రుణం ఏ సందర్భాల్లో తీసుకోవచ్చో కూడా చూద్దాం. చాలా మందికి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వారి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. ఇలా ఖర్చుల్ని తప్పించుకోలేని పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులు వారికి చాలా వరకు ఉపయోగపడతాయి. మరి ఏ పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు లోన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు అనేది తెలుసుకుందాం.
మెడికల్ ఎమర్జెన్సీ..
ఈ రోజుల్లో ఆస్పత్రిలో చేరాల్సి వస్తే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం అకస్మాత్తుగా రావొచ్చు. అప్పుడు వెంటనే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కొందరికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండదు. ఉన్నా కూడా అది చాలకపోవచ్చు. అప్పుడు క్రెడిట్ కార్డుపై ఆధారపడాల్సి వస్తుంది. మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో.. ఆస్పత్రి బిల్లులు, మందుల కోసం క్రెడిట్ కార్డు నుంచి లోన్ తీసుకొని కట్టేయొచ్చు.
ప్రయాణాలు..
కొన్ని సార్లు కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురికావడం, మరణించడం వంటివి జరుగుతుంటాయి. అప్పుడు.. కుటుంబం మొత్తం అక్కడికి చేరుకోవాలంటే విమాన ప్రయాణాలు వంటివి చేయాల్సి రావొచ్చు. కానీ విమాన ప్రయాణం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. అప్పుడు కూడా చేతిలో డబ్బు లేకుంటే.. క్రెడిట్ కార్డులు ఉపయోగపడతాయి.
ఇంటి మరమ్మతులు..
ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఒక్కోసారి అనుకోని సంఘటనలు జరిగితే.. ఇంటికి పెద్ద మరమ్మతులో అవసరం పడొచ్చు. వెంటనే ఈ పని చేయించకపోయినా ఇంటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవచ్చు. అప్పుడు తక్కువ వడ్డీకి దొరికే టాపప్ హోం లోన్స్ కోసం ప్రయత్నించాలి. సాధ్యం కాకుంటే క్రెడిట్ కార్డు ద్వారా హోమ్ రిపేర్ ఖర్చుల్ని భర్తీ చేయొచ్చు.
వాహన రిపేర్స్..
మీ మోటార్ వాహనం బ్రేక్ డౌన్ అయినా.. ఇతర డ్యామేజీలు ఉన్నా.. చేతిలో నగదు లేని పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు ఉపయోగించడం ఉత్తమం. ఇదే సమయంలో ఉన్నట్లుండి ఉద్యోగం కోల్పోయిన పరిస్థితుల్లో కనీసం 6 నెలలకు సరిపడా అత్యవసర నిధి లేకుంటే ఇక్కడ కూడా క్రెడిట్ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా పిల్లల స్కూల్ ఫీజుల కోసం కూడా చేతిలో నగదు లేని పరిస్థితుల్లో.. క్రెడిట్ కార్డు ఉపయోగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
క్రెడిట్ కార్డు లోన్ తీస్కొని.. EMI సదుపాయం ద్వారా తిరిగి చెల్లించొచ్చు. క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడం చాలా ముఖ్యం. లేకపోతే అధిక వడ్డీ రేట్లు, ఇతర ఛార్జీలు వర్తిస్తాయి. క్రెడిట్ కార్డును అతిగా వాడటం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. క్రెడిట్ కార్డు వినియోగంపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.
Latest News