|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 11:17 PM
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో హెడింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్ తనదైన శైలిలో విరుచుకుపడ్డ ఈ ప్లేయర్.. 146 బంతుల్లో మూడంకెల మార్కును అందుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో తన ఏడో సెంచరీని నమోదు చేశాడు. ఫలితంగా భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సాధించాడు. సెంచరీ చేశాక తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు.
భారత తొలి వికెట్ కీపర్..
ఈ సెంచరీ ద్వారా రిషభ్ పంత్.. మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు క్రియేట్ చేశాడు. అంతకుముందు ఈ రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉండేది. ధోనీ తన కెరీర్‌లో (90 టెస్టులు) ఆరు టెస్టు సెంచరీలు సాధించాడు. అయితే పంత్ మాత్రం కేవలం 76 ఇన్నింగ్స్‌లలోనే ఏడో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో వృద్ధిమాన్ సాహా మూడు సెంచరీలతో మూడో ప్లేసులో ఉన్నాడు.
కాగా పంత్ చేసిన సెంచరీల్లో ఎక్కువగా విదేశీ పిచ్‌లపై వచ్చినవే కావడం గమనార్హం. అందులోనే ఇంగ్లాండ్ అంటే పంత్ చెలరేగిపోతాడు. తన మొత్తం 7 టెస్టు సెంచరీల్లో పంత్.. ఇంగ్లాండ్ గడ్డపైనే మూడు సాధించాడు. రెండు సెంచరీలు భారత్‌లో చేశాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఒక్కో సెంచరీ చొప్పున సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులోనూ సిక్స్‌తోనే సెంచరీ మార్కును చేరుకున్నాడు. 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడు.. బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తున్నాడు.
టెస్టుల్లో పంత్ సెంచరీలు..
తొలి టెస్టు సెంచరీ - లండన్
రెండో టెస్టు సెంచరీ - సిడ్నీ
మూడో టెస్టు సెంచరీ - అహ్మదాబాద్
నాలుగో టెస్టు సెంచరీ - కేప్‌టౌన్
ఐదో టెస్టు సెంచరీ - బర్మింగ్‌హామ్
ఆరో టెస్టు సెంచరీ - చెన్నై
ఏడో టెస్టు సెంచరీ - లీడ్స్