|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 09:11 PM
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు 2026 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలని పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రతిపాదించింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవల నెలకొన్న సంక్షోభంలో ట్రంప్ తనదైన శైలిలో దౌత్యపరంగా జోక్యం చేసుకుని.. కాల్పుల విరమణ చేశారని, ఫలితంగా యుద్ధాన్ని నివారించారని ఎక్స్ వేదికగా వెల్లడించింది. అయితే ట్రంప్ జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించారన్న పాకిస్థాన్ వాదనను భారత అధికారులు గట్టిగా ఖండించారు. కానీ అదేమీ పట్టించుకోని ట్రంప్ మరోసారి ఇదే విషయం గురించి మాట్లాడుతూ.. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపానని అయినప్పటికీ.. తనకు నోబెల్ బహుమతి ఇవ్వరేమోనని నైరాశ్యం వ్యంక్తం చేశారు.
పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ ఆసీమ్ మునీర్.. ఈ వారం మొదట్లో ట్రంప్‌ను వైట్ హౌస్‌లో మధ్యాహ్న భోజనానికి కలవడం ఒక అరుదైన సంఘటనగా నిలిచింది. మే నెలలో ఇండియా-పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణ జరిగినప్పుడు, అణు యుద్ధం రాకుండా ట్రంప్ సహాయం చేశారని మునీర్ పేర్కొన్న కొద్ది రోజులకే ఈ కలయిక జరిగిందని వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ తెలిపారు. అందుకే ట్రంప్ మునీర్‌ను కలవడానికి అంగీకరించారని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు భారత ప్రభుత్వం ఈ వాదనను బలంగా తిరస్కరించింది.
మే 7వ తేదీ నుంచి 10వ తేదీల్లో జరిగిన సైనిక చర్య తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం ఇరు దేశాల మిలిటరీ అధికారుల మధ్య జరిగిన చర్చల ద్వారానే సాధ్యమైందని, ఇందులో మూడో పక్షం జోక్యం ఏమాత్రం లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ముఖ్యంగా ట్రంప్‌తో 35 నిమిషాల ఫోన్‌లో మాట్లాడిన మోదీ.. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని భారత్ మొదటి నుంచీ చెబుతోందని.. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ మాత్రం తనకు నోబెల్ బహుమతి రావాలని ఆకాంక్షించారు. భారత్-పాకిస్తాన్ వ్యవహారాలతో పాటు కాంగో-రువాండా దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో తన పాత్ర ఉందని ఆయన నొక్కి చెప్పారు. "నాకు నాలుగైదు సార్లు నోబెల్ బహుమతి రావాల్సి ఉంది, కానీ వారు లిబరల్స్‌కు మాత్రమే ఆ బహుమతి ఇస్తారు" అని ట్రంప్ ఆరోపించారు. తనను విస్మరిస్తున్నందుకు నోబెల్ కమిటీపై విమర్శలు గుప్పించారు. తాను జోక్యం చేసుకున్నాను కాబట్టే అణు యుద్ధం తప్పిపోయిందని, ఇది అందరి సమిష్టి విజయమని, అయితే ఇందులో US దౌత్య ప్రయత్నాలే ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ పునరుద్ఘాటించారు.
ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయాలన్న ఈ ప్రతిపాదనపై అంతర్జాతీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ట్రంప్ చేసిన కృషిని మెచ్చుకుంటుండగా, మరికొందరు ఆయన జోక్యం చేసుకున్నట్లు చేసిన ప్రకటనలను కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని తప్పుబడుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయం ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.