|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 08:10 PM
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మధురైలోని వేలంమాళ్ పాఠశాల 10,000 మంది విద్యార్థులతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ రవి చేసిన ప్రదర్శన అందరినీ అబ్బుర పరిచింది. 70 ఏళ్లకు పైబడిన వయస్సులోనూ ఆయన చూపిన ఉత్సాహం, ఫిట్‌నెస్ చూసి "ఆయన 70 ఏళ్ల వృద్ధుడా? 30 ఏళ్ల యువకుడా?" అని అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.
యోగా కార్యక్రమానికి వచ్చిన తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవి.. నామమాత్రంగా యోగా చేసి వెళ్లిపోకుండా, గవర్నర్ స్వయంగా మైక్ తగిలించుకొని విద్యార్థులతో పాటు ఆసనాలను చేసి చూపించారు. ఆయన చేసిన ప్రతీ ఆసనం ఎంతో పద్ధతిగా, క్రమబద్ధంగా ఉండటంతో అక్కడున్నవారంతా ఆయన శారీరక దృఢత్వాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ ప్రదర్శనలో అత్యంత ఆకర్షణీయమైన ఘట్టం ఏమిటంటే.. గవర్నర్ ఏకధాటిగా, విరామం లేకుండా 51 పుష్ అప్స్ ను అలవోకగా చేయడం. ఈ అద్భుతమైన ప్రదర్శన అక్కడున్న విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఇతర అతిథులను సంపూర్ణంగా నివ్వెరపరిచింది. ఒక 70 ఏళ్ల వ్యక్తి ఇంత శారీరక సామర్థ్యాన్ని ప్రదర్శించడం నిజంగా అసాధారణం అని అందరూ ప్రశంసించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎవరు దీన్ని చూసిన గవర్నర్ ఫిట్ నెస్ కు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా యోగా ప్రాంగణం అంతా ఆయన చిరునవ్వుతో నిండిపోయింది. అలాగే వైట్ టీషర్టు వేసుకుని వచ్చిన ఆయన.. అచ్చంగా కుర్రాడిలా కనిపిస్తూ అందరినీ అలరించారు. ఆయనలో కనిపించిన క్రమశిక్షణ, అంకిత భావం, దృఢ సంకల్పం ఒక ఐపీఎస్ అధికారికి ఉండాల్సిన లక్షణాలను ప్రతిబింబించాయి.
గవర్నర్ కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా, యువతకు ఆదర్శంగా నిలిచేలా ఈ యోగా దినోత్సవాన్ని ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమంగా మార్చారు. నిస్వార్థంగా యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఆయన నిరూపించారు. యువతరం ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఈ ప్రదర్శన పరోక్షంగా సందేశం ఇచ్చింది. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని గవర్నర్ తన ప్రదర్శన ద్వారా నిరూపించారు.
Latest News