|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 05:53 PM
యోగా భారతీయ వారసత్వ సంపదని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రేపు విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమంపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో చేపడుతున్నట్టు వెల్లడించారు.ప్రజల ఆరోగ్యం కోసం యోగాకు విస్తృత ప్రచారం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తొమ్మిదో తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థులతో రోజూ పది నిమిషాల పాటు యోగా చేయించడం ద్వారా వారిలో చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో యోగా కోర్సులను ప్రవేశపెడతామని, ప్రతి పాఠశాలలో వారానికి రెండు యోగా క్లాసులు ఉండేలా సిలబస్ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఎన్టీఆర్ యోగా పరిషత్‌ను ఏర్పాటు చేశామని, అది తెలంగాణకు వెళ్లిపోయిందని గుర్తుచేశారు. స్వర్ణాంధ్ర తరహాలో యోగా కోసం ఒక లాభాపేక్ష లేని సంస్థను (నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్) ఏర్పాటు చేసి, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులతో ప్రచారం కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. యోగా, నేచురోపతి కోర్సులతో ఒక డీమ్డ్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏటా లేదా రెండేళ్లకు ఒకసారి జిల్లాల్లో యోగా పోటీలు నిర్వహించి, సర్టిఫికెట్లు జారీ చేస్తామని వెల్లడించారు.యోగాంధ్రలో భాగంగా గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. శనివారం (జూన్ 21) రాష్ట్రవ్యాప్తంగా 1.29 లక్షల ప్రాంతాల్లో 2 కోట్ల మందికి పైగా యోగాసనాలు వేయనున్నారని వివరించారు. విశాఖపట్నంలో జరిగే ప్రధాన యోగాంధ్ర కార్యక్రమం దేశంలోని 7 లక్షల ప్రదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని చెప్పారు.
Latest News