|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 03:02 PM
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఓ యువతి ప్రేమ కోసం తన భర్త, అత్తింటి కుటుంబాన్ని మోసం చేసి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పెళ్లై నెలన్నర మాత్రమే అయినా.. లక్షల విలువైన నగలు, నగదు తీసుకొని తన ప్రియుడితో కలిసి తలదాచుకుందట. అంతకుముందు ఆ కుటుంబంలో ప్రేమగా మెలిగి, విశ్వాసం పొందిన ఆమె.. అర్థరాత్రి లస్సీలో మత్తు మందు కలిపి అందరికీ ఇచ్చిందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే… హాపూర్ జిల్లా సిటీ కొత్వాలి ప్రాంతంలోని సారవా గ్రామానికి చెందిన సల్మాన్ అనే వడ్రంగి, లోనీ ప్రాంతానికి చెందిన సనా అనే యువతిని ఏప్రిల్ 25న వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత సనా, భర్తతోపాటు అత్తమామలతో ప్రేమగా మెలిగింది. అత్తింటివారు ఆమె నడవడికతో సంతృప్తిగా ఉండిపోయారు. కానీ, ఇదంతా బహుశా నాటకమే. ఎందుకంటే పెళ్లికి ముందే సనాకు ఘజియాబాద్‌కు చెందిన సోహైల్ అనే యువకుడితో ప్రేమ సంబంధం ఉండేది. పెళ్లైన తర్వాత కూడా వాళ్లు ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవారు. మే 13 రాత్రి, సనా ప్రేమగా తన భర్త, మిగిలిన కుటుంబ సభ్యులకు పెరుగు లస్సీ అందించింది. తాగిన కొద్ది సేపట్లోనే వారు అందరూ స్పృహతప్పి పడిపోగా, ఇంట్లో ఉన్న రూ.50 వేల నగదు, లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకొని సనా తన ప్రియుడితో కలిసి బైక్ పై పారిపోయింది. తెల్లారేసరికి భార్య కనిపించకపోవడంతో సల్మాన్ చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తు అనంతరం సీసీటీవీ ఫుటేజ్‌లో రాత్రి 12.30 గంటల సమయంలో ఓ యువకుడితో బైక్ పై వెళ్లిపోయిన దృశ్యం కనిపించింది. మత్తు మందు కలిపిన లస్సీ వల్లే కుటుంబ సభ్యులు స్పృహ తప్పారని పోలీసులు నిర్ధారించారు. సనా కుటుంబ సభ్యులను ప్రశ్నించగా కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదట. అంతేకాకుండా, దర్యాప్తులో సోహైల్ అనే వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. అతను ఘజియాబాద్‌లో ఏసీ రిపేరింగ్ వర్కర్. ఇద్దరినీ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ ఇచ్చినా సనా తాను తన ప్రేమికుడితోనే ఉండాలని తేల్చి చెప్పింది. భర్త వద్దకు తిరిగి వెళ్లేందుకు ఆమె నిరాకరించడంతో, పోలీసులు సనాను ఆమె బంధువులకు అప్పగించారు. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పెళ్లి అనేది విశ్వాసంతో నడిచే బంధం అని భావించే సమాజంలో, ఇలాంటి మోసాలు పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు మిగిలిన న్యాయపరమైన చర్యలు కొనసాగిస్తున్నారు.
Latest News