|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 01:11 PM
కడప నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈరోజు (శుక్రవారం) కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరుగనుండటంతో కార్పోరేషన్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇద్దరు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 20 మంది ఎస్ఐ, 53 ఏఎస్ఐ, 110 కానిస్టేబుల్, 4 స్పెషల్ పార్టీ బృందాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే కార్పోరేషన్ కార్యాలయం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కార్పొరేటర్‌లు తప్ప ఇతరులు ఎవరికీ కూడా లోనికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. కాగా.. గత ఆరు నెలలుగా మేయర్ సురేష్ బాబు, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి మధ్య వివాదం నడుస్తోంది. కార్పొరేషన్‌లో నిబంధనలకు విరుద్దంగా మేయర్ కుటుంబం చేసిన కాంట్రాక్టు పనులపై వివాదం చెలరేగింది. మేయర్‌పై మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలో హైకోర్టుకు వెళ్లిన మేయర్.. అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని, సర్వసభ్య సమావేశం జరగాలని కోరారు. దీంతో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న మేయర్ ఈరోజు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఎక్స్ అఫీసియో హోదాలో సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే మాధవీ రెడ్డి రానున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా మాధవీ రెడ్డి కుర్చీపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Latest News