పాక్ ఆర్మీ చీఫ్‌తో ట్రంప్ లంచ్ భేటీ.. అమెరికా ఈక్వేషన్లు మారాయా..?
 

by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:06 PM

అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ .. డొనాల్డ్ ట్రంప్‌తో లంచ్ చేయనున్నారు. వైట్‌హౌస్‌లో ట్రంప్, అసిమ్ మునీర్ భేటీ కానున్నారు. అయితే జీ7 సదస్సు కోసం ప్రధాని మోదీ కెనడా చేరుకునే లోపే.. తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్న ట్రంప్ నిన్న అమెరికా వెళ్లిపోయారు. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్‌తో వైట్‌హౌస్‌లో ట్రంప్ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక యూఎస్ ఆర్మీ వార్షికోత్సవాలకు అసిమ్ మునీర్ హాజరవుతారని వార్తలు రాగా.. దాన్ని అమెరికా ఖండించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్, పాకిస్తాన్ విషయంలో అమెరికా ప్రాధాన్యతలు మారిపోయాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక పక్క పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌తో జరిగిన సైనిక ఘర్షణల నేపథ్యంలో అసిమ్ మునీర్ అమెరికాకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


5 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసిం మునీర్.. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు. వైట్‌హౌస్ కేబినెట్ రూమ్‌లో వీరిద్దరి లంచ్ భేటీ జరగనుంది. అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా అసిమ్ మునీర్ ఆ దేశంలో ఐదు రోజుల పర్యటనకు చేరుకున్నారు. అయితే అంతకుముందే ఈనెల 14వ తేదీన జరిగిన యూఎస్ ఆర్మీ 250వ వార్షిక వేడుకలకు అసిమ్ మునీర్ హాజరు కానున్నారనే వార్తలు వైరల్ కాగా.. ఆయనకు ఎలాంటి ఆహ్వానం ఇవ్వలేదని వైట్‌హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్, మునీర్ భేటీకి సంబంధించిన వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక అమెరికాలో పర్యటిస్తున్న అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా అక్కడి పాకిస్తాన్ పౌరులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


 అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన డైలీ పబ్లిక్ షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బుధవారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:00 గంటలకు వైట్‌హౌస్ కేబినెట్ రూమ్‌లో డొనాల్డ్ ట్రంప్ మధ్యాహ్న భోజనం చేయనున్నారు. పాకిస్తాన్ దినపత్రిక డాన్ నివేదిక ప్రకారం.. ఈ పర్యటనలో అసిమ్ మునీర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్‌లతో కూడా సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాషింగ్టన్‌ చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాలు.. అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యమని పేర్కొంది.


మరోవైపు.. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ ఇరాన్‌ వైపు నిలిచింది. ఇజ్రాయెల్‌ తమపై అణుబాంబును ప్రయోగిస్తే.. పాకిస్తాన్‌ రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌పై అణుబాంబుతో దాడి చేస్తుందని ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ జనరల్‌, ఇరాన్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ మెంబర్‌ మొహ్సెన్‌ రెజాయ్‌ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పాకిస్తాన్ నుంచి స్పష్టమైన హామీ లభించిందని ఆయన తెలిపారు. అయితే ఇరాన్‌ ఇచ్చిన ప్రకటనను పాక్‌ ఖండిచింది. తాము అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని పాకిస్తాన్‌ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌కు పాకిస్తాన్ మద్దతు ఇవ్వకుండా ఒంటరి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్.. అసిమ్ మునీర్‌తో భేటీకి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.


కెనడా వేదికగా జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సు కోసం ఆ దేశ ప్రధానమంత్రి మార్క్ కార్నీ అధికారిక ఆహ్వానం మేరకు మంగళవారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. అయితే ప్రధాని మోదీ కెనడాలో అడుగుపెట్టక ముందే.. జీ7 సదస్సు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా వెళ్లిపోయారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ.. పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇది జరిగిన ఒక్క రోజులోనే పాక్ ఆర్మీ చీఫ్‌తో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడం గమనార్హం.

Latest News
EAM Jaishankar and UNGA President discuss reformed multilateralism, SDGs and West Asia conflict Tue, Apr 28, 2026, 05:01 PM
FIFA World Cup 2026: 'Modric will do everything to recover in time,' says Croatia coach Dalic Tue, Apr 28, 2026, 04:47 PM
PM Modi gets grand welcome in Varanasi, women power in spotlight Tue, Apr 28, 2026, 04:46 PM
Markets end lower as crude oil surge weighs; mid, small caps outperform Tue, Apr 28, 2026, 04:43 PM
Maruti Suzuki India's Q4 net profit dips 6.4 pc to Rs 3,659 crore, announces Rs 140 dividend Tue, Apr 28, 2026, 04:26 PM