|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:47 AM
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారంటే ఇది ప్రజాస్వామ్యమా లేక రెడ్ బుక్ రాజ్యాంగమా అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఏ రాష్ట్రంలోనైనా ఇలా జరుగుతుందా, ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం ఎక్కడైనా చూశామా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకుడే మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం అత్యంత దారుణమన్నారు. కుప్పం నియోజకవర్గంలో మహిళను చెట్టుకు కట్టేసిన టీడీపీ కార్యకర్త ఘటనను మాజీ మంత్రి ఆర్ కే రోజా తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..... `చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇది ప్రజాస్వామ్యామా? రెడ్‌బుక్ రాజ్యమా అనే అనుమానం కలిగే విధంగా రాష్ట్రంలో ప్రతి రోజు మహిళలు, బాలికలపై దాడులు చేయడం, అత్యాచారాలు చేయడం, హత్యలు చేయడం, చెట్టుకు కట్టేసి కొట్టడం..ఇది ఏ రాష్ట్రంలోనైనా జరుగుతున్నాయా? ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతుందంటే ఇక్కడ చంద్రబాబు గానీ, పవన్ కళ్యాణ్ గానీ, హోం మంత్రి అనితా మహిళల పట్ల ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో, మహిళల రక్షణను ఎలా గాలికి వదిలేశారో అందరికీ అర్థమవుతోంది అని అన్నారు.
Latest News