|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:29 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసించడం సభ్య సమాజం సిగ్గుపడే ఘటన అని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ కూడా లేదనేందుకు ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. ఈ సంఘటనలో బాధితురాలిని పరామర్శించే తీరిక కూడా ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఇటువంటి దారుణానికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ..... కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో శిరీష అనే మహిళకు జరిగిన అన్యాయం మీద వైయస్సార్సీపీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోంది. తప్పు చేసిన టీడీపీ కార్యకర్తలను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. అప్పు తీర్చలేదనే కారణంతో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం దారుణమైతే, సాక్షాత్తూ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో జరగడం దౌర్భాగ్యం. మహిళను అవమానించేలా ఇంత ఘోరమైన సంఘటన జరిగితే హోంమంత్రి అనిత వీడియో కాల్ లో పరామర్శించి చేతులు కడిగేసుకుంది. రాష్ట్రంలో మహిళల మీద వరుస అఘాయిత్యాలు, దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చుంది. మహిళ అయ్యుండీ హోంమంత్రి కనీస బాధ్యతగా నడుచుకోవడం లేదు. మహిళను నేరుగా వెళ్లి పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని ధైర్యం చెప్పి రాకుండా వీడియో కాల్‌తో సరిపెట్టేసింది అని మండిపడ్డారు.
Latest News