భారత్‌-ఇంగ్లాండ్ తొలి టెస్టు,,,,భారత జట్టు ప్లేయింగ్‌ లెవెన్ ప్రకటించిన రవిశాస్త్రి
 

by Suryaa Desk | Tue, Jun 17, 2025, 10:58 PM

జూన్ 20న హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్ట్ మ్యాచ్‌ కోసం భారత జట్టు కూర్పుపై మాజీ కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. భారత టెస్ట్ క్రికెట్‌లో ఒక కొత్త శకానికి నాంది పలుకుతూ.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్‌మెంట్ తర్వాత యువ సంచలనం.. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ కీలక పరిణామం నేపథ్యంలో, రవిశాస్త్రి తన తుది జట్టును ప్రకటించాడు. ఇందులో కొన్ని ఆసక్తికరమైన ఎంపికలు ఉన్నాయి.


బ్యాటింగ్ లైనప్


ఓపెనింగ్ స్థానాలకు జైశ్వాల్‌తో పాటు కేఎల్ రాహుల్‌ను శాస్త్రి ఎంపిక చేశాడు. రాహుల్‌కు ఇంగ్లాండ్‌లో టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని, గత పర్యటనలో ఓపెనింగ్ చేసి సెంచరీ సాధించి మంచి ప్రదర్శన ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. "జైస్వాల్, అతనితో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఉంటాడు. ఎందుకంటే ఇది అతనికి పెద్ద టూర్ అని నేను అనుకుంటున్నాను. అతను అత్యంత అనుభవజ్ఞుడైన బ్యాటర్" అని శాస్త్రి అన్నాడు.


యువ సాయి సుదర్శన్‌ను మూడో స్థానంలో ఆడించాలని శాస్త్రి సూచించాడు. "నేను అతని గురించి చాలా చూశా. ఎక్కడైనా అతను బాగా ఆకట్టుకున్నాడు. ఈ పర్యటన అతనికి మంచి అనుభవం అవుతుంది." అని శాస్త్రి వివరించాడు. ఇక జట్టు సారథి శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడని శాస్త్రి తెలిపాడు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలోకి వచ్చిన కరుణ్ నాయర్‌కు తన టెస్ట్ జట్టులో చోటు కల్పించాడు రవిశాస్త్రి.


"అన్ని విధాలుగా, ప్రస్తుత ఫామ్ ఆధారంగా, కరుణ్ నాయర్ నా టీంలో ఉంటాడు. అతను ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. నాయర్.. భారత్‌ తరపున ఆడి చాలా కాలం అయ్యింది' అని 63 ఏళ్ల శాస్త్రి అన్నాడు. నాయర్ దేశవాళీ క్రికెట్‌లో విపరీతంగా పరుగులు సాధించి, తన ఎంపికకు అర్హత సాధించాడని శాస్త్రి ప్రశంసించాడు. రిషభ్‌ పంత్‌ను ఆరో స్థానంలో ఆడించాలని శాస్త్రి సూచించాడు. అంటే పంత్ ఒక స్థానం దిగువలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది.


ఆల్‌రౌండర్లుగా జడేజా, శార్దుల్/నితీష్ రెడ్డి


రవీంద్ర జడేజాను ప్రధాన స్పిన్నర్‌గా, ఏడో స్థానంలో ఆల్ రౌండర్‌గా ఎంపిక చేశాడు. అయితే.. ఈ జట్టులో కుల్దీప్ యాదవ్ వంటి ప్రధాన స్పిన్నర్‌కు చోటు దక్కలేదు. మరో ఆల్ రౌండర్‌గా.. షార్దుల్ ఠాకూర్‌, నితీష్ కుమార్ రెడ్డిలో ఒకరిని తీసుకోవాలని సూచించాడు. "షార్దుల్, నితీష్ రెడ్డి మధ్య ఒకరు ఉంటారు. ఇది కష్టమని నాకు తెలుసు. కానీ ఎవరు ఎంత బౌలింగ్ చేస్తారో మీరు చూడాలి. నితీష్ 12- 14 ఓవర్లు బౌలింగ్ వేస్తే.. అతను బ్యాటింగ్ కారణంగా ఎంపిక కావొచ్చు" అని శాస్త్రి వివరించాడు.


పేస్ బౌలర్లు ఎవరంటే?


పేస్ విభాగంలో జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లు కచ్చితంగా ఉంటారని శాస్త్రి స్పష్టం చేశాడు. మూడో పేసర్‌గా ప్రసిద్ధ్ కృష్ణకు మొగ్గు చూపాడు. "నేను ప్రసిద్ధ్ కృష్ణను ఎంచుకుంటాను. లీడ్స్‌లో పరిస్థితులు మేఘావృతమై ఉంటే, ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అయితే అర్ష్‌దీప్ సింగ్ లేదా ఆకాష్ దీప్ కంటే ప్రసిద్ధ్ కృష్ణనే ఎంపిక చేయాలని సూచించాడు.


ఈ ఎంపికలు ఇంగ్లాండ్ పరిస్థితులకు అనుగుణంగా, పేస్ బౌలింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ చేసినట్లు తెలుస్తోంది. కోహ్లీ, రోహిత్ లేని భారత టెస్ట్ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.


రవిశాస్త్రి ఎంపిక చేసిన తుది జట్టు ఇదే


యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, షార్దుల్ ఠాకూర్/నితీష్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ/ అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్‌ సిరాజ్.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM