|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 09:51 PM
కొందరు దొంగలు చేసే పనులు హాస్యాస్పదంగా, విస్తుపోయేలా ఉంటాయి. దొంగలందరూ సినిమాల్లో చూపించినంత తెలివైనవారు కాదు. కొన్నిసార్లు వారి చేష్టలు నవ్వు తెప్పిస్తాయి. పోలీసులు, ప్రజలను ఆశ్చర్యపరిచే అలాంటి చిత్ర విచిత్రమైన దొంగతనాలు గతంలో చాలానే జరిగాయి. తాజాగా హైదరాబాద్ చందానగర్‌లో అటువంటే దొంగతనమే జరిగింది. ఏటీఎం సెంటర్‌లో చోరీకి వచ్చిన ఓ దొంగ.. రాబరీకి విఫలయత్నం చేసి అక్కడే కునుకు తీశాడు. కట్ చేస్తే సీన్‌లోకి పోలీసులు ఎంట్రీ కాగా.. మనోడు బిక్కమెహం వేసుకొని ఈజీగా దొరికిపోయాడు.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం (జూన్ 15) అర్ధరాత్రి దాటిన తర్వాత నల్లగండ్ల శుభం హోటల్ సమీపంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం కేంద్రంలోకి ఓ అజ్ఞాత వ్యక్తి ప్రవేశించాడు. తన వద్ద ఉన్న పదునైన ఆయుధాలతో ఏటీఎంను ధ్వసం చేసేందుకు ప్రయత్నించాడు. కిందా మీద పడినా.. ఏటీఎం ఓపెన్ కాలేదు. చెమటలు చిందించినా.. ఉపయోగం లేకుండా పోయింది. దీంతో అలసిపోయిన దొంగ.. ఇక నా వల్ల కాదంటూ అక్కడే కునుకు తీశాడు. అయితే ఏటీఎం సెంటర్‌లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ముంబైలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి అలర్ట్ వెళ్లింది.
దీంతో బ్యాంకు సిబ్బంది చందానగర్ పోలీసులను అప్రమత్తం చేశారు. హుటాహుటిన ఏటీఎం వద్దకు చేరుకున్న పోలీసులు తలుపు తెరిచి చూశారు. అక్కడ దొంగ గారు హాయిగా నిద్రపోవటం చూసి నవ్వాపుకోలేకపోయారు. దొంగతనానికి వచ్చి నిద్రపోతున్నావేంట్రా అని తట్టి లేపారు. పోలీసులను చూసిన సదరు దొంగ బిక్కమోహం వేసుకొని షాక్‌కు గురయ్యారు. అయితే ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అతడు నిజంగానే దొంగతననాకి వచ్చాడా..? ఎక్కడి నుంచి వచ్చాడు..? తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటన మాత్రం పోలీసులకు ఒక పెద్ద తలనొప్పిని తగ్గించి, కాస్త వినోదాన్ని పంచింది. దొంగతనం చేయలేకపోయినా.. విఫలయత్నం చేసి పోలీసులకు తనను పట్టుకునే పనిని సులభతరం చేశాడు ఈ భలే దొంగ. కాదు.. కాదు.. ఈ నిద్రమోహం దొంగ.