అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్‌‌ అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా సొంత ప్రజల నిరసనలు
 

by Suryaa Desk | Tue, Jun 17, 2025, 09:34 PM

అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్‌కు.. వాషింగ్టన్‌లో నిరసనకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అధికారిక పర్యటనలో భాగంగా అమెరికాకు వెళ్లిన అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. వాషింగ్టన్‌లో తీవ్ర వ్యతిరేకతను ఎదురుకావడం ఆయనకు అవమానంగా మారింది. పాకిస్తాన్ ‌లో అనియంత్రిత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అమెరికాలో ఉంటున్న పాకిస్తాన్ జాతీయులు, పాకిస్తాన్ మూలాలు ఉన్న ప్రజలు అసిమ్ మునీర్ బస చేసిన హోటల్ సమీపంలో గుంపుగా ఏర్పడి నిరసనలు వ్యక్తం చేశారు. పాక్ ఆర్మీ చీఫ్‌కు వ్యతిరేకంగా చేసిన నినాదాలు, ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


ఆ హోటల్ నుంచి అసిమ్ మునీర్ బయటికి వస్తుండగా.. అక్కడ గుమిగూడిన పాక్ ప్రజలు.. సిగ్గు సిగ్గు.. అసిమ్ మునీర్ పిరికివాడని.. సామూహిక హంతకుడు అని.. నియంత అంటూ నినాదాలు హోరెత్తించడం ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆ హోటల్‌లోకి ప్రవేశించేందుకు నిరసనకారులు ప్రయత్నించగా.. వారిని అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో అధికారులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు.


ఇక మరో వీడియోలో.. ఆ బిల్డింగ్ సమీపంలో పార్క్ చేసిన ఒక వాహనంపై ఎలక్ట్రానిక్ బిల్ బోర్డు కూడా ఉంది. దానిపై అసిమ్ మునీర్.. సామూహిక హంతకుడు, తుపాకులు మాట్లాడినప్పుడు ప్రజాస్వామ్యం చనిపోతుంది అంటూ నినాదాలను ప్రదర్శించారు. ఇక ఈ నిరసనల వెనుక మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పీటీఐ పార్టీ కార్యకర్తలు చాలా కాలంగా ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న ప్రభుత్వం, ఆర్మీ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసిమ్ మునీర్ పర్యటన అధికారికంగా ప్రకటించబడకముందే.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పీటీఐ, వాషింగ్టన్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల నిరసనకు పిలుపునిచ్చింది.


పాకిస్తాన్ అధికారిక పత్రిక డాన్ న్యూస్ నివేదిక ప్రకారం.. అసిమ్ మునీర్ అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో 5 రోజుల అధికారిక పర్యటన కోసం ఆదివారం వాషింగ్టన్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా ద్వైపాక్షిక బంధం బలోపేతం కోసమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జూన్ 14వ తేదీన జరిగిన అమెరికా ఆర్మీ 250వ వార్షికోత్సవ వేడుకలతో.. అసిమ్ మునీర్ పర్యటనకు అధికారికంగా సంబంధం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ అదే సమయానికి అసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించడం గమనార్హం.


పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ శనివారం వాషింగ్టన్ మిలిటరీ పరేడ్‌కు ఆహ్వానించినట్లు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. అయితే అసిమ్ మునీర్‌కు ఆహ్వానం పంపించలేదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. డాన్ నివేదిక అసిమ్ మునీర్ మిలిటరీ పరేడ్ రోజున వాషింగ్టన్‌లో ఉన్నప్పటికీ.. ఆయన ఈ ఈవెంట్‌లో పాల్గొనలేదని స్పష్టం చేసింది.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM