|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 07:38 PM
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో..రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. ఏడాది పాలనలో అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు ఖరారుతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవం నిర్వహించారు. అలాగే పనులు కూడా ప్రారంభమయ్యాయి. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, క్రికెట్ స్టేడియం వంటి నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరో 40 వేల ఎకరాల భూమిని అమరావతి కోసం సమీకరించాలని భావిస్తు్న్నారు.
ఈ క్రమంలోనే రాజధాని అమరావతిపై మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అమరావతి ముఖద్వారంగా మూలపాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అమరావతి ముఖద్వారంగా మూలపాడును అధికారులు పరిశీలిస్తున్నారని.తెలిసింది. మూలపాడు ప్రాంతంలో ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని ఇప్పటికే ప్రణాళికలు రచించారు. తాజాగా అమరావతి ప్రధాన ప్రవేశద్వారంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు ప్రాంతం విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండటంతో దీనినే ప్రధాన ప్రవేశద్వారంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాయపూడి నుంచి మూలపాడు వరకు కృష్ణానది మీద ఐకానిక్ బ్రిడ్జ్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు డీపీఆర్ రూపొందించడానికి కన్సల్టెంట్ నియామకానికై టెండర్లు కూడా పిలిచారు. శాఖమూరు నుంచి రాయపూడి వరకు నిర్మిస్తున్న 13వ నంబర్ జాతీయ రహదారిని మూలపాడు వద్ద మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారితో అనుసంధానించనున్నారు. ఇందుకోసం 5.2 కిలోమీటర్ల మేరకు ఐకానిక్ వంతెన నిర్మించనున్నారు. మొత్తంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులను మూడేళ్లలోగా పూర్తిచేసి.. ఆంధ్రుల రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Latest News