|
|
by Suryaa Desk | Wed, Jun 11, 2025, 01:48 PM
ఎండలతో అల్లాడిపోతున్న ఏపీకి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తీపి కబురు వినిపించింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రత్యేకించి- దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన సమయంలో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమ వరకూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. ఆ తరువాత మళ్లీ రుతు పవనాలు బ్రేక్ తీసుకున్నాయి. వాటి కదలికలు మందగించాయి. ఫలితంగా- ఉష్ణోగ్రత మళ్లీ మొదటికొచ్చింది. 40 డిగ్రీలకుపైగా ఎండ తీవ్రత కనిపించింది. వేడిగాలులూ వీచాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరికి గురి అయ్యారు. నడివేసవి పరిస్థితులను చవి చూశారు. ఇప్పుడీ పరిస్థితి నుంచి ఉపశమనం లభించనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. నేడు, రేపు ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి- మోస్తారు వర్షాలు పడొచ్చు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేశారు. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తలదాచుకోవద్దని కోరారు. గురువారం నాడు పలు జిల్లాల్లో ఎండ తీవ్రత మళ్లీ మొదటికి రావొచ్చని ఏపీఎస్డీఎంఏ అంచనా వేసింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత రికార్డు అయ్యే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు.
Latest News