|
|
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 09:48 PM
ఒకసారి వయసు 60 ఏళ్లు దాటిందంటే సురక్షితమైన పెట్టుబడులు, రిటైర్మెంట్ లైఫ్ పైకి ఫోకస్ మారుతుంది. ఎలాంటి రిస్క్ లేని మార్గాల్లోనే డబ్బులు పెడతారు. అలాంటి వారికి బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లు సరైన ఎంపికగా చెప్పవచ్చు. పదవీ విరమణ తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించే సీనియర్ సిటిజన్లకు ఈ విషయాలు చాలా కీలకం. తమ వద్ద ఉన్న డబ్బులను సురక్షితమైన బ్యాంక్ డిపాజిట్లులోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీటిల్లో గ్యారెంటీ రిటర్న్స్ ఉండడంతో పాటు సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేట్లు ఉంటాయి. అదనపు వడ్డీ రేట్లు 50 నుంచి 70 బేసిస్ పాయింట్ల వరకు ఉంటుంది.
అయితే వడ్డీ రేట్లు అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఆర్‌బీఐ వరుసగా మూడోసారి రెపో రేటును తగ్గించింది. ఇటీవలే ఒక్కసారిగా 50 బెసిస్ పాయింట్లు కోత పెట్టింది. దీంతో చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. అయితే, ఇలాంటి పరిస్థితుల్లోనూ 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు 6 ప్రభుత్వ బ్యాంకులు ఊరట కల్పించాయి. అధిక వడ్డీ రేట్లు ఇస్తూ శుభవార్త చెప్పాయి. కొన్ని బ్యాంకులు సుమారు 8 శాతం వడ్డీ ఇస్తున్నాయి. 400 రోజుల నుంచి 555 రోజుల టెన్యూర్ మధ్య ఉండే వాటికి అధిక వడ్డీలు ఇస్తున్నాయి. మరి ఆ జాబితా ఓసారి తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 1 ఏడాది నుంచి 10 సంవత్సరాల లోపు ఉండే టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7 శాతం నుంచి 7.40 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ప్రస్తుతం 1 ఏడాది, 555 రోజుల స్పెషల్ టెన్యూర్ డిపాజిట్ పథకాల ద్వారా 7.25 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ ఇస్తోంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ప్రస్తుతం 1 ఏడాది నుంచి 5 సంవత్సరాల లోపు డిపాజిట్ల ద్వారా సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం నుంచి 7.95 శాతం వరకు వడ్డీ ఇస్తోంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 ఏడాది నుంచి 5 సంవత్సరాల వరకు ఉండే డిపాజిట్లపై సీనియర్లకు 7.10 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ అందిస్తున్నాయి.
ఇండియన్ బ్యాంక్ ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 1 ఏడాది, 400, 555 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై గరిష్ఠంగా 7.25 శాతం నుంచి 7.65 శాతం మేర వడ్డీ అందిస్తున్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రస్తుతం 1 ఏడాది నుంచి 5 సంవత్సరాల వరకు ఉండే డిపాజిట్లపై 7.25 శాతం నుంచి 7.80 శాతం వరకు వడ్డీ ఉంది.
అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అనేవి ప్రత్యేక పథకాలు, టెన్యూర్, విత్ డ్రా నిబంధనల ఆధారంగా మారుతుంటాయి. అన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత డబ్బులు డిపాజిట్ చేయాలి. పైన పేర్కొన్న వడ్డీ రేట్లు జూన్ 10వ తేదీ వరకు ఉన్నవి.
Latest News