![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:46 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన ప్రపంచ కుబేరుడు.. టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలకమైన డోజ్‌కు సారథ్యం వహించారు. ఈ క్రమంలోనే ఇటీవలె డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ఎలాన్ మస్క్.. బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో డోజ్ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగారు. దీంతో ట్రంప్-మస్క్ స్నేహం చెడిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇక అమెరికా సెక్స్ కుంభకోణంలో నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టైన్ కేసులో డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఉందని ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ పెను దుమారం సృష్టించగా.. ఆ తర్వాత దాన్ని ఆయన తొలగించారు. ఇలాంటి పరిణామాలతో ట్రంప్, మస్క్ మధ్య బ్రోమాన్స్ ముగిసిపోయిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ నుంచి ఇటీవల కొనుగోలు చేసిన టెస్లా మోడల్ ఎస్ కారును డొనాల్డ్ ట్రంప్ దూరం పెడతారనే ప్రచారం జోరుగా సాగుతుండగా.. తాజాగా స్పందించిన ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియా సమావేశంలో ఓ జర్నలిస్ట్ టెస్లా కారు గురించి ప్రశ్నలు అడగ్గా.. తానేమీ ఆ కారును వదులుకోలేదని.. అందులో ప్రయాణిస్తా అంటూ తేల్చి చెప్పేశారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఇప్పుడు వినియోగిస్తున్న స్టార్‌లింక్ సేవలను కూడా నిలిపివేయడం లేదని స్పష్టం చేశారు. స్టార్‌లింక్ అద్భుత సేవలు అందిస్తోందని ప్రశంసించారు.
ఇక ఎలాన్ మస్క్‌తో మాట్లాడాలి అనుకుంటున్నారా అని మరో జర్నలిస్ట్ ప్రశ్నించగా.. అతని స్థానంలో తాను ఉంటే కచ్చితంగా మాట్లాడాలని అనుకునేవాడిని అని సమాధానం ఇచ్చారు. అయితే మస్క్ కూడా అదే అనుకుని ఉండవచ్చని.. ఆ విషయం అతడ్నే అడగాలని సూచించారు. తమ మధ్య మంచి రిలేషన్ ఉందని.. ఈ సందర్బంగా మస్క్‌కు అభినందనలు తెలిపారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పోస్ట్‌కు స్పందించిన మస్క్.. హార్ట్ ఎమోజీ షేర్ చేయడం గమనార్హం. మరోవైపు.. వైట్‌హౌస్‌లో ఎలాన్ మస్క్ డ్రగ్స్ తీసుకున్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ట్రంప్.. తనకు తెలియదని చెప్పారు. అయితే ఎలాన్ మస్క్ అలా చేసి ఉండరని తాను నమ్ముతున్నట్లు వివరించారు.