![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:23 PM
మేఘాలయలోని షిల్లాంగ్‌కు హనీమూన్‌కు అని వెళ్లి భర్తను చంపేసిన కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లైన తర్వాత భర్తను హనీమూన్‌కు తీసుకెళ్లి అక్కడ కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. చాలా పకడ్బందీగా, అంతా ప్లాన్ ప్రకారం చేసినప్పటికీ సోనమ్ చేసిన ఒకే ఒక్క తప్పుతో ప్లాన్ మొత్తం తారుమారు అయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి అయింది. ముఖ్యంగా హత్య చేయమని మాత్రమే సూపారీ ఇచ్చిన సోనమ్.. ఎలా చేయాలో చెప్పకపోవడం వల్లే జైలుకు వెళ్లాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
రాజా రఘువంశీని హనీమూన్‌కు పక్కా ప్లాన్ ప్రకారం ఒప్పంచింది సోనమ్. హత్యకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ప్లాన్ ప్రకారమే పకడ్బందీగా చేసుకుంది. అయితే కిరాయి హంతకులు హత్యకు ఉపయోగించిన పదునైన ఆయుధంతోనే అంతా తారుమారు అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా అలాంటి పదునైన ఆయుధాలను మేఘాలయలో ఉపయోగించరని, దాని వల్ల బయటి వ్యక్తి ప్రమేయం ఉందని తమకు అనుమానం వచ్చినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ఆ తర్వాతే సోనమ్ కాల్ రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. హత్యకు ముందు సుపారీ ఇచ్చిన వ్యక్తుల్లో ఒకరిని సోనమ్ కాంటాక్ట్ చేసిందని గుర్తించినట్లు చెప్పారు.
రాజా, సోనమ్ ఆచూకీ గల్లంతు కావడానికి ముందు ఆమె ఫోన్ లొకేషన్‌తో, నిందితుల ఫోన్ లొకేషన్ మ్యాచ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా పోలీసు కస్టడీలో ఉన్న సోనమ్ సహా మిగతా నిందితులను మేఘాలయకు తీసుకెళ్తున్నారు. మరోవైపు ప్రధాన నిందితుడిగా ఉన్న కుశ్వాహా మేఘాలయకు వెళ్లకుండానే.. హత్యకు ప్లాన్ చేశాడు. ఆ సమయంలో సోనమ్‌తో టచ్‌లో ఉన్నాడని తెలిపారు. అయితే.. రఘువంశీని తాను చంపించలేదని, తననే ఎవరో కిడ్నాప్ చేశారని సోనమ్ చెప్పడం గమనార్హం. ముగ్గురు పురుషులతో ఆమె వెళ్తున్నప్పుడు చూశానని స్థానిక గైడ్ వెల్లడించడం ఈ కేసులో కీలకంగా మారిన సంగతి తెలిసిందే.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ-సోనమ్‌కు మే 11వ తేదీన వివాహం జరిగింది. 20వ తేదీన హనీమూన్ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. అయితే వారు మొదట జమ్మూకశ్మీర్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అక్కడ పహల్గాం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో వారు మేఘాలయకు తమ హనీమూన్ ప్లాన్ మార్చుకున్నారు. అక్కడే రెండ్రోజుల తర్వాత వారి ఆచూకీ గల్లంతైంది. జూన్ 2వ తేదీన రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. ఒక పదునైన ఆయుధంతో అతడి తలపై రెండుసార్లు కొట్టినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. సోనమ్ బాయ్‌ఫ్రెండ్ అని చెప్తున్న రాజ్ కుశ్వాహా మే 18వ తేదీన ఈ హత్యకు ప్రణాళిక వేశాడని ఇండోర్ పోలీసు ఉన్నతాధికారి రాజేశ్ దండోతియా వెల్లడించారు.
Latest News