రాజా రఘువంశీ దారుణ హత్య వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 10:21 AM

రాజా రఘువంశీ దారుణ హత్య వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ

హనీమూన్ యాత్రలో తన భర్త రాజా రఘువంశీని హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీని మేఘాలయ పోలీసులు పాట్నాకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆమెను పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచారు. నేటి మధ్యాహ్నం 12:40 గంటలకు పాట్నా విమానాశ్రయం నుంచి సోనమ్‌ను గువాహటికి విమానంలో తరలించడానికి మేఘాలయ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఉదయం 11 గంటల కల్లా పోలీసుల బృందం ఆమెను విమానాశ్రయానికి తీసుకెళ్లనుందని సమాచారం. గువాహటి నుంచి ఆమెను రోడ్డు మార్గంలో షిల్లాంగ్‌కు తరలిస్తారు. సోనమ్‌ను తరలించి, విచారించేందుకు మేఘాలయ పోలీసులు ఐదు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ పొందారు.గత రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పోలీసు బృందం బక్సర్ మీదుగా సోనమ్‌తో పాట్నాకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు, బీహార్ పోలీసులు, మేఘాలయకు చెందిన నలుగురు సిబ్బందితో కూడిన బృందం ఆమెకు రక్షణగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫుల్వారీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, గువాహటి ప్రయాణానికి ముందు విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు సూచించారు.మే 23న హనీమూన్‌కు వెళ్లిన రాజా, సోనమ్ దంపతులు అదృశ్యమయ్యారు. జూన్ 2న మేఘాలయలోని వైసాడాంగ్ పార్కింగ్ లాట్ సమీపంలోని లోయలో రాజా మృతదేహం లభ్యమైంది. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన సోనమ్ 8న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పోలీసులకు లొంగిపోయింది. తనకు మత్తుమందు ఇచ్చి ఘాజీపూర్‌కు తీసుకొచ్చారని సోనమ్ ఉత్తర ప్రదేశ్ పోలీసుల శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ అమితాబ్ యశ్‌కు తెలిపినట్లు సమాచారం. రెండు వారాలుగా పలు రాష్ట్రాల పోలీసులను ఉత్కంఠకు గురిచేసిన ఈ కేసులో సోనమ్ లొంగిపోవడం కీలక మలుపుగా మారింది.వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగిందని మేఘాలయ పోలీసులు భావిస్తున్నారు. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి సోనమ్ తన భర్త హత్యకు కుట్ర పన్నిందని, ఒత్తిడి పెరగడంతో లొంగిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో సోనమ్‌తో పాటు ఆమె ప్రియుడు రాజ్ సింగ్ కుష్వాహా, ఇండోర్‌కు చెందిన విశాల్ సింగ్ చౌహాన్, లలిత్‌పూర్‌కు చెందిన ఆకాశ్ రాజ్‌పుత్, సాగర్ జిల్లా బినాకు చెందిన ఆనంద్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంచలన హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

Latest News
11 dead, 567 arrested as anti-govt protests hit Kenya Tue, Jul 08, 2025, 10:59 AM
Death toll from passenger ship sinking in Indonesia rises to 10 Tue, Jul 08, 2025, 10:53 AM
Death toll in Telangana factory blast rises to 44 Tue, Jul 08, 2025, 10:50 AM
Forecast for hotter, humid days in TN for next few days Tue, Jul 08, 2025, 10:46 AM
Home-cooked veg, non-veg thalis get cheaper in June as inflation cools Tue, Jul 08, 2025, 10:43 AM