![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 06:41 PM
రాజస్థాన్ కాంగ్రెస్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఏళ్లుగా తీవ్ర రాజకీయ వైరం కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్.. పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో శనివారం జైపూర్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ వారిద్దరి మధ్య నెలకొన్న విభేదాలకు తెరపడి, సయోధ్య కుదిరే అవకాశాలున్నాయనే చర్చకు దారితీసింది.దివంగత కేంద్ర మంత్రి, తన తండ్రి రాజేష్ పైలట్ 25వ వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అశోక్ గెహ్లాట్‌ను సచిన్ పైలట్ వ్యక్తిగతంగా ఆహ్వానించారు. 11న రాజేష్ పైలట్ మాజీ పార్లమెంటరీ నియోజకవర్గమైన దౌసాలో ఈ స్మారక కార్యక్రమం జరగనుంది. 25 ఏళ్ల క్రితం రాజేష్ పైలట్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం, రాజకీయ ఆధిపత్య పోరు నడిచింది. 2020లో రాజస్థాన్ కాంగ్రెస్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం తర్వాత ఇలా బహిరంగంగా కలుసుకోవడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ సమావేశం అనంతరం ఇరువురు నేతలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ తన నివాసంలో మాజీ కేంద్ర మంత్రి రాజేష్ పైలట్ 25వ వర్ధంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు" అని గెహ్లాట్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. "రాజేష్ పైలట్, నేను 1980లో కలిసి లోక్‌సభలో అడుగుపెట్టాం. దాదాపు 18 ఏళ్లపాటు ఎంపీలుగా పనిచేశాం. ఆయన అకాల మరణం నాకు వ్యక్తిగతంగా, పార్టీకి తీరని లోటు" అని రాజేష్ పైలట్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గెహ్లాట్ గుర్తు చేసుకున్నారు.సచిన్ పైలట్ కూడా తమ భేటీకి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ "ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కలిశాను. జూన్ 11న దౌసాలో మా నాన్నగారు రాజేష్ పైలట్ 25వ వర్ధంతి సందర్భంగా జరిగే స్మారక కార్యక్రమానికి హాజరుకావాలని వారిని అభ్యర్థించాను" అని పేర్కొన్నారు. రాజేష్ పైలట్ జూన్ 2000లో జైపూర్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని దౌసా జిల్లా భండానా గ్రామంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు.అయితే, సయోధ్య గురించి ఇరుపక్షాల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ, శనివారం నాటి ఈ సమావేశం రాజస్థాన్‌లో కీలకమైన పార్టీ సంస్థాగత నిర్ణయాలకు ముందు సయోధ్య కుదిరే అవకాశం ఉందన్న ఊహాగానాలకు కాంగ్రెస్ వర్గాల్లో తెరలేపింది.
Latest News