|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:13 PM
ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత 2 ఏళ్లుగా భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై గాజా భూభాగంలో ఉన్న హమాస్ మిలిటెంట్లు దాడి చేయడంతో ఈ యుద్ధం తీవ్రతరం అయింది. అయితే అప్పటి నుంచి వరుసగా హమాస్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నా.. వెనక్కి మాత్రం తగ్గడం లేదు. ఇక గాజా నుంచి పూర్తిగా హమాస్ మిలిటెంట్లు లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ భీకర ఆపరేషన్లు చేస్తున్నాయి. దీంతో గాజాలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. లక్షల మంది పాలస్తీనియన్లు గాజాను విడిచిపెట్టి విదేశాలకు వెళ్లగా.. ఇటీవలె తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అయితే 2 ఏళ్లుగా యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. చాలా మంది ఆకలితో అలమటించి ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోగా.. మరికొందరు ఆకలితో మృతి చెందారు.
కొన్ని నెలలుగా గాజా సరిహద్దులను మూసివేయడంతో నిత్యావసర వస్తువులు ఆ దేశం లోపలికి వెళ్లే మార్గం నిలిచిపోయింది. దీంతో గాజాలో ప్రస్తుతం తీవ్ర కరవు తాండవిస్తోంది. ఇక నిత్యావసరాలు లేక పాలస్తీనియన్లు అవస్థలు పడుతున్నారు. ఎక్కడైనా కిరాణా సామాగ్రి దొరినా అక్కడి ధరలు విని వారు షాక్ అవుతున్నారు. అయితే తాజాగా గాజాలోని ఒక వ్యక్తి.. పార్లే-జీ బిస్కెట్ల ధరకు సంబంధించి ఎక్స్‌లో చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. తాము తమ బిడ్డలకు బిస్కెట్లు కూడా కొనలేని పరిస్థితికి వెళ్లిపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు.
గాజాలో ప్రస్తుతం రూ.5 పార్లే-జీ బిస్కెట్ రూ.2300కి విక్రయిస్తున్నారు. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పార్లే-జీ బిస్కెట్లు దాదాపు 4300 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశం నుంచి గాజాకు ఎగుమతి అవుతున్నాయి. మహమ్మద్ జావేద్ అనే వ్యక్తి.. తన కుమారుడు రవీఫ్‌కు ఇష్టమైన పార్లే జీ బిస్కెట్లు 24 యూరోలు అంటే భారత కరెన్సీలో ఏకంగా రూ.2,342 విక్రయిస్తున్నారని ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశాడు. చాలా రోజుల తర్వాత రవీఫ్‌కు ఇష్టమైన బిస్కెట్లు కొన్నానని పేర్కొన్నాడు. గతంలో 1.5 యూరోలు అంటే భారత కరెన్సీలో రూ.146 ఉండగా.. ఇప్పుడు భారీగా ధర పెరిగిందని అయినప్పటికీ.. రఫీఫ్‌కు ఇష్టమైన బిస్కెట్లు కొనివ్వకుండా ఉండలేకపోయానని పేర్కొన్నాడు. అయితే ఈ పోస్ట్ చూసిన భారతీయులు.. మన దేశంలో ఇంత తక్కువ ధరకు దొరికే బిస్కెట్లు.. గాజాలో అంత ధర పలకడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఒక్క పార్లే జీ బిస్కెట్ ధరలే కాకుండా అన్ని వస్తువుల ధరలు గాజాలో మండిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. జూన్ 6వ తేదీ నాటికి ఉత్తర గాజా నుంచి వచ్చిన కొన్ని ముఖ్యమైన వస్తువుల ధరలు ఇలా ఉన్నాయి.
కిలో చక్కెర: రూ. 4,914
లీటరు వంట నూనె: రూ. 4,177
కిలో బంగాళాదుంపలు: రూ. 1,965
కిలో ఉల్లిపాయలు: రూ. 4,423
కాఫీ కప్పు: రూ. 1,800
Latest News