|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 06:07 PM
ఆర్సీబీ విజయోత్సవాల వేళ బుధవారం రోజు బెంగళూరులో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మొత్తంగా 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 33 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యేమేనంటూ విమర్శలు రాగా.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దీనిపై స్పందించారు. తొక్కిసలాట సమయంలో 5 వేల మంది పోలీసులు ఉన్నా.. అభిమానుల్ని అదుపు చేయలేకపోయినట్లు చెప్పారు. కానీ తాజాగా ఈ వ్యవహారం హైకోర్టుకు వెళ్లగా.. అక్కడ విస్తుపోయే విషయాలు తెలిశాయి. ముఖ్యంగా తొక్కిసలాట సమయంలో చిన్నస్వామి స్టేడియంలో కేవలం వెయ్యి మంది మాత్రమే పోలీసులు ఉన్నట్లు నేరుగా ఆ రాష్ట్ర సర్కారే వెల్లడించింది. దీంతో డిప్యూటీ సీఎం అబద్ధం ఎందుకు చెప్పారనే విషయం గమనార్హంగా మారింది.
ఆర్సీబీ విజయోత్సవాల వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. లక్షలాది మంది అభిమానులను అదుపు చేయడానికి 5 వేల మంది వరకు పోలీసులు విధుల్లో ఉన్నట్లు ఇప్పటి వరకు అంతా అనుకున్నారు. ఆర్సీబీ ఈవెంట్‌కు 5 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా చెప్పారు. 5 వేల మంది ఎక్కడ సరిపోతారన్న విశ్లేషణలు, అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే హైకోర్టు విచారణ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాల్లో కేవలం 1000 మంది పైగా పోలీసులు మాత్రమే విధుల్లో ఉన్నట్లు తెలిపింది.
తొక్కిసలాట ఘటనపై విమర్శలు రావడంతో ఈ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా పరిగణించింది. వేడుక కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం విషాదంగా మారిందని, తొక్కిసలాట దుర్ఘటన వెనక కారణాలను తేల్చాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి ఘటనలను మనం నివారించగలమా.. భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏం చేయగలమని ఆలోచించాలంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రభుత్వం తరఫు న్యాయవాధి వాదనలు వినిపిస్తూ.. రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వాటర్ ట్యాంకర్లు, అంబులెన్స్‌లు, కమాండ్ అండ్ కంట్రోల్ వాహనాలను సిద్ధంగా ఉంచినట్లు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35 వేలు మాత్రమేనని, సాధారణ సమయాల్లో 30 వేల టికెట్లు మాత్రమే ఇస్తారని.. ఆర్సీబీ విజయోత్సవాల కార్యక్రమానికి దాదాపు 2.5 లక్షల మందికి పైగా అభిమానులు తరలి వచ్చినట్లు కోర్టుకు తెలిపారు. అందరినీ లోపలికి పంపిస్తారని అభిమానులు భావించారని అన్నారు. మధ్యాహ్నం నుంచే రద్దీ మొదలు కాగా.. సాయంత్రానికి చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయి పరిస్థితి చేయి దాటిపోయినట్లు వివరించారు. ప్రభుత్వం ఎక్కడా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాధి చెప్పుకొచ్చారు. ఈ విషయంలో న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Latest News