|
|
by Suryaa Desk | Thu, Jun 05, 2025, 05:55 PM
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తికాకముందే, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 'వెన్నుపోటు దినం' నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని, ఇది ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల ఆగ్రహానికి నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు. సజ్జల నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మేము ఊహించినదానికంటే ఎక్కువగా ప్రజలు 'వెన్నుపోటు దినం'లో పాల్గొన్నారు. ఇది చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టం చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న తీరుపై ప్రజలు విసుగెత్తిపోయారు" అని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసిందని, ఈ నిధులు ఏమయ్యాయో, ఏయే వర్గాలకు ప్రయోజనం చేకూరిందో చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు.
Latest News