బంగ్లాదేశ్ యువతులతో పెళ్లిళ్లు వద్దు.. తమ పౌరులకు చైనా వార్నింగ్
 

by Suryaa Desk | Mon, May 26, 2025, 07:29 PM

అక్రమ సరిహద్దు వివాహ బంధాల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఆన్‌లైన్‌లో పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం పట్ల అప్రమత్తంగా ఉండాలని బంగ్లాదేశ్‌లోని చైనా ఎంబసీ తమ దేశ పౌరులకు ఆదివారం సలహా ఇచ్చింది. చట్టానికి వ్యతిరేకంగా విదేశాలకు చెందిన యువతులను కొనుగోలు చేసే ఆలోచనను తిరస్కరించాలని.. బంగ్లాదేశ్‌లో పెళ్లి చేసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని చైనా రాయబార కార్యాలయం కోరింది. చైనాలో వధువుల అక్రమ రవాణాపై తీవ్ర ఆందోళనలు పెరుగుతున్న వేళ.. చైనా ఎంబసీ హెచ్చరించింది. గతంలో చైనాలో వన్ చైల్డ్ విధానం, మగ పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వడం కారణంగా.. ప్రస్తుతం చైనా లింగ అసమతుల్యతను ఎదుర్కొంటోంది. సుమారు 3 కోట్ల మంది చైనా పురుషులకు వధువులు దొరకడం లేదు. ఇలాంటి వారిని లెఫ్ట్ ఓవర్ మెన్ అని పిలుస్తారు. చైనాలో తగ్గుతున్న పెళ్లిళ్ల కారణంగా విదేశీ వధువులకు డిమాండ్‌ పెరిగింది.


ది డైలీ స్టార్ అనే న్యూస్ పేపర్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. పెళ్లి పేరుతో బంగ్లాదేశ్ మహిళలను చైనాలో విక్రయిస్తున్న కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. క్రిమినల్ గ్యాంగ్‌లు ఈ బంగ్లాదేశ్ మహిళల అక్రమ రవాణా నిర్వహిస్తున్నాయి. ఈ పెళ్లిళ్లలో చాలా వరకు అక్రమంగా, దోపిడీ మార్గాల ద్వారా ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి పెళ్లిళ్లు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీస్తాయని చైనా రాయబార కార్యాలయం వెల్లడించింది.


 చైనా చట్టం ప్రకారం.. సరిహద్దులు దాటి పెళ్లిళ్లు చేసుకునే సేవలను మరింత సులభం చేసే పెళ్లిళ్ల ఏజెన్సీలపై నిషేధించారు. లాభం కోసం, మోసం ద్వారా ఇలాంటి సరిహద్దు ఆవల పెళ్లిళ్లు వంటి కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని కూడా నిషేధించింది. లైంగిక సంబంధాలు, పెళ్లి స్కామ్‌ల బారిన పడిన బాధితులు వెంటనే చైనా అధికారులకు ఫిర్యాదు చేయాలని చైనా ఎంబసీ హితవు పలికింది. బంగ్లాదేశ్‌లో ఇలాంటి అక్రమ పెళ్లిళ్లలో పాల్గొన్న వారు మానవ అక్రమ రవాణా కింద అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయని కూడా హెచ్చరించింది.


బంగ్లాదేశ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ చట్టం, పీనల్ కోడ్ ప్రకారం.. మానవ అక్రమ రవాణా చేసేవారికి కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా కొన్ని కేసుల్లో జీవిత ఖైదు, మరణశిక్ష కూడా వేస్తారు. అక్రమ రవాణాను ప్రేరేపించే.. వారికి 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష, 20,000 బంగ్లాదేశ్ టాకాలు అంటే మన భారత కరెన్సీలో రూ.15 వేలకు పైనే జరిమానా విధిస్తారు. ఇక ఇలాంటి నెట్‌వర్క్‌లు బంగ్లాదేశ్ మహిళలను భారత్‌లోకి కూడా అక్రమ రవాణా చేశాయి. 2021లో ఢాకా పోలీసులు టిక్ టాక్‌ను ఉపయోగించి మహిళలను సెక్స్ వ్యాపారంలోకి దించిన 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM