|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 06:52 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చిన సంగతి తెలిసిందే. మార్చి నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోగా.. తాజాగా జీవో జారీ అయ్యింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ( మే 26) జీవో విడుదల చేసింది. మరోవైపు వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. టీడీపీ మహానాడులో వైఎస్ఆర్ పేరును పలకాల్సి వస్తుందనే కారణంతో ఏకంగా జిల్లా పేరునే మార్చేశారంటూ వైఎస్ షర్మిల విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు నిర్ణయం వ్యక్తిగతంగా తనను బాధించే నిర్ణయమే అయినప్పటికీ.. కడప జిల్లా చరిత్రను, సంప్రదాయాలను గౌరవిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
"మహానాడు ముచ్చటలో వైఎస్ఆర్ పేరే పలకాల్సి వస్తుందని ఒక్కరోజు ముందు ఏకంగా జిల్లా పేరునే మార్చేశారు. వ్యక్తిగతంగా ఇది బాధించే అంశమే అయినా.. కడప జిల్లా చరిత్రను, సంప్రదాయాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. మహానేత మరణానంతరం కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ." అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
అయితే వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు అంశంపై ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తూనే వైఎస్ షర్మిల కొత్త మెలిక పెట్టారు. ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ మీద కక్షపూరిత రాజకీయాలు లేవనుకుంటే.. పేరు మార్పు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదనుకుంటే, ఎన్టీఆర్ జిల్లా పేరును కూడా మార్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాగా కాకుండా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా మార్చాలంటూ డిమాండ్ చేశారు.
"కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ పేరుమీద కక్ష్యపూరిత రాజకీయాలు అజెండా కాదు అనుకుంటే, పేర్లు మార్పు వెనుక మీకు దురుద్దేశ్యం లేకుంటే, సెంటిమెంట్ ప్రకారం పాత జిల్లా పేర్లు కొనసాగించాలని కోరిక ఉంటే, విజయవాడ నగరానికి ఎన్టీఆర్ జిల్లాగా కాకుండా, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా పేరు మార్చాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. వైఎస్ఆర్ జిల్లా వైఎస్సార్ కడప జిల్లాగా మార్చినప్పుడు ఎన్టీఆర్ జిల్లాను ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా మారిస్తే తప్పేంటని అడుగుతున్నాం. వైఎస్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరు తెలుగు జాతి గర్వించే ఈ గడ్డ కన్న బిడ్డలే. ప్రజల గుండెల్లో ఇద్దరిది సమాన స్థానమే. ఒకరికి ఒకలా, మరొకరి మరోలా రాజకీయాలు ఆపాదించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం." అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేశారు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. వైఎస్ఆర్ కడప జిల్లాలో నుంచి కడపను తొలిగించ వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది. అయితే తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లాగా వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చింది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఎన్టీఆర్ జిల్లా పేరుతో వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.