|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 07:44 PM
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పేర్ని నాని, ఆయన అనుచరులు ఆసుపత్రి వద్ద గందరగోళం సృష్టించారు.మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైద్య పరీక్షల కోసం నిన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో పేర్ని నాని, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ తమ అనుచరులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని భద్రతా సిబ్బంది అడ్డుకోగా, ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో భద్రతా సిబ్బంది, పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులతో పేర్ని నాని వర్గీయులకు వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడిని కలవడానికి వీల్లేదని పోలీసులు స్పష్టం చేసి, వారిని వెనక్కి పంపించారు.అనంతరం, అక్కడ విధుల్లో ఉన్న వైద్య సిబ్బందితో వైసీపీ నేతలు మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, వెంటనే ఆసుపత్రిలో చేర్చుకోవాలని అడిగినట్లు సమాచారం. అయితే, వైద్య పరీక్షలన్నీ నిర్వహించిన అనంతరం వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వైసీపీ నేతలు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
Latest News