![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 09:11 PM
చాలా హాస్టళ్లు భద్రతా నిబంధనలను పాటించడం లేదు. అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, సరైన వెంటిలేషన్ లేకపోవడం వంటివి సాధారణమైపోయాయి. గదులు చాలా ఇరుకుగా ఉండటం, తగినంత వెంటిలేషన్ లేకపోవడం, మంచాలు దగ్గర దగ్గరగా ఉండటం వంటివి గమనించవచ్చు. ఈ దారుణమైన పరిస్థితులు హాస్టళ్లలో నివసించే వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, హాస్టళ్లను పర్యవేక్షించి, నిబంధనలను పాటించేలా చూడాలని నిపుణులు కోరుతున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కూడా ఈ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రైవేటు హాస్టళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), టాస్క్ ఫోర్స్ బృందాలు రైడ్లు జరిపాయి. మెుత్తం 58 హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ దాడుల్లో దారుణ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఖైరతాబాద్, ఎల్‌బీ నగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్‌లలోని హాస్టళ్లలో ఈ తనిఖీలు నిర్వహించారు. చాలా వరకు కిచెన్‌లలో తీవ్రమైన అపరిశుభ్రత నెలకొంది. ఆహార పదార్థాలను నేలపైనే నిల్వ చేయడం, బొద్దింకలు, ఎలుకలు, ఆహారాన్ని తయారు చేసేవారు ఫుడ్ హ్యాండ్లర్లు, హెయిర్ క్యాప్‌లు, ఏప్రాన్‌లు ధరించకపోవటం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను వినియోగించడం, కిటికీలకు ఇన్‌సెక్ట్-ప్రూఫ్ స్క్రీన్‌లు లేకపోవటం వంటివి వెలుగుచూశాయి.
నిబంధనలు ఉల్లంఘించిన 30 హాస్టళ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన 5 హాస్టళ్ల కిచెన్‌లను సీజ్ చేశారు. జీహెచ్ఎంసీ చట్టం, 1955 ప్రకారం నిబంధనలు పాటించని హాస్టళ్లకు మొత్తం రూ. 2,45,500 జరిమానా విధించారు. హాస్టల్ యజమానులకు నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ.. నిర్లక్ష్యం వహిస్తున్నారని అలాంటి వారిపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.