|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 08:01 PM
పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయక టూరిస్ట్‌ల ప్రాణాలను తీసుకున్న ఘటనను భారత్ తీవ్రంగా పరిగణించింది. దీంతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భారత దళాలు కేవలం నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే కాకుండా.. పాకిస్తాన్ సైన్యానికి కూడా వెన్నులో వణుకు పుట్టించేలా దాడులు చేసింది. భారత్ దాడులతో పాక్ సైనిక కమ్యూనికేషన్లకు అంతరాయం కలగడంతో.. సీనియర్ అధికారులు మధ్యలోనే తమ పోస్టులను వదిలి పారిపోయినట్లు వెల్లడించాయి.
భారత సైనిక వర్గాలు తెలిపిన ప్రకారం.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్ సమీపంలో ఉన్న పాకిస్తాన్ 75వ పదాతిదళ బ్రిగేడ్ కమాండర్.. భారత్ చేస్తున్న దాడుల తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వెనక్కి రావడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించడంపై పాకిస్తాన్ సైన్యంలోని జూనియర్ అధికారులు.. అతడిని సంప్రదించినప్పుడు.. అతను భయానకంగా స్పందించారని సమాచారం. ఆఫీస్ తర్వాత తెరుచుకుంటుంది కానీ.. ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి అంటూ సీనియర్లు చెప్పినట్లు తెలుస్తోంది.
మధ్యలో వినిపించిన రేడియో సంభాషణల ఆధారంగా పాక్ కమాండర్ ఒక మసీదులోకి పరుగులు తీసి.. అక్కడ ఆశ్రయం పొందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తమ కమాండర్ చాలా కష్టంతో తప్పించుకున్నారని.. ఒక జూనియర్ అధికారి తెలిపారు. భయంతో అతడు మసీదులోకి పారిపోయి నమాజ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అతను తన మనుషులను ఆఫీస్‌కు పంపించి.. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాతే తిరిగి వస్తానని చెప్పినట్లు ఆ రేడియో సంభాషణల్లో వినిపించింది.