|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 06:23 PM
భారత టెస్టు క్రికెట్ జట్టుకు తదుపరి కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, టీమిండియా టెస్టు సారథ్య బాధ్యతలకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్ని విధాలా సరైన వ్యక్తి అని భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత నవజ్యోత్ సింగ్ సిద్ధూ అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు ఎంపిక జరుగుతున్న సమయంలో సిద్ధూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కొద్ది రోజుల క్రితం రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దరిమిలా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త టెస్టు కెప్టెన్ ఎంపికపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ, "ప్రస్తుతం భారత టెస్టు జట్టు కొన్ని క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. జట్టును సరైన మార్గంలో నడిపించాలంటే బలమైన నాయకుడు అవసరం. అదే సమయంలో, కెప్టెన్‌కు జట్టు సభ్యుల నుంచి పూర్తి మద్దతు కూడా ఉండాలి. గత ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించినప్పుడు ఏం జరిగిందో మనమంతా చూశాం. అయితే, ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది, అతనికి ఆమోదం లభిస్తోంది. కానీ, భారత జట్టును ఒక్కతాటిపై నడిపించగల సత్తా జస్ప్రీత్ బుమ్రాకు ఉందని నేను నమ్ముతున్నాను" అని తెలిపారు.
Latest News