|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 06:15 PM
బెంగళూరు నగరంలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గత 20 రోజుల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఓ సలహా ప్రకటన జారీ చేసింది.శుక్రవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ, "ఈ ఏడాది కర్ణాటకలో ఇప్పటివరకు 35 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 32 కేసులు ఒక్క బెంగళూరు నగరంలోనే వెలుగు చూశాయి," అని తెలిపారు. "గత 20 రోజులుగా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగా ఏమీ లేదు. అయినప్పటికీ ప్రజలు ముందుజాగ్రత్తగా కొవిడ్ నిబంధనలు పాటించడం అవసరం," అని ఆయన సూచించారు. గర్భిణులు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర అనారోగ్య సమస్యలున్నవారు రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, హ్యాండ్ శానిటైజర్లు వాడాలని ఆయన కోరారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని, తద్వారా సకాలంలో చికిత్స పొంది, వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని మంత్రి వివరించారు.
Latest News