![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 06:11 PM
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి వెనుక పెద్ద కుట్ర ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, కశ్మీర్‌లో అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగాన్ని దెబ్బతీయడం, దేశంలో మత ఘర్షణలు రెచ్చగొట్టడమే ఈ దాడి ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. బెర్లిన్‌లో జరిగిన డీజీఏపీ సెంటర్ ఫర్ జియోపాలిటిక్స్, జియోఎకనామిక్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమంలో మాట్లాడుతూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఉగ్రవాదం విషయంలో భారత్ ఏమాత్రం సహించబోదని, అణు బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని జైశంకర్ తేల్చిచెప్పారు. పాకిస్థాన్ ప్రేరేపిత సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ అవలంబిస్తున్న నూతన విధానాల గురించి జర్మనీ అగ్ర నాయకత్వానికి వివరించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఏ దేశం కూడా సమర్థించదని, అన్ని దేశాలు ఖండించాయని ఆయన గుర్తుచేశారు. పహల్గామ్ దాడిని జర్మనీ కూడా తీవ్రంగా ఖండించిందని, ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండగా నిలుస్తుందని తెలిపిందని జైశంకర్ పేర్కొన్నారు. తమ పొరుగు దేశమైన పాకిస్థాన్ నుంచి ఉద్భవిస్తున్న ఉగ్రవాద శిబిరాలు, శిక్షణా కేంద్రాలపైనే భారత్ దాడులు చేసిందని, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ ప్రాయోజిత విధానంగా వాడుకుంటూ భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఉగ్రవాదంపై పోరాడే హక్కు భారత్‌కు ఉందని జర్మనీ గుర్తించిందని జైశంకర్ తెలిపారు.
Latest News