![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 06:06 PM
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక మిఠాయి దుకాణ యజమాని తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దేశభక్తిని చాటుకునేందుకు తన దుకాణంలో విక్రయించే కొన్ని మిఠాయిల పేర్లను మార్చేశారు. ముఖ్యంగా, అందరికీ సుపరిచితమైన 'మైసూర్ పాక్' పేరును 'మైసూర్ శ్రీ'గా మార్చడం విశేషం.పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే, కొందరు సామాజిక మాధ్యమాలలో 'మైసూర్ పాక్' వంటి స్వీట్ల పేర్లలో 'పాక్' అనే పదాన్ని తొలగించాలని ప్రచారం చేశారు. ఈ ఆలోచన జైపూర్‌లోని ప్రముఖ 'త్యోహార్ స్వీట్స్' యజమాని అంజలీ జైన్‌కు బాగా నచ్చింది. వెంటనే ఆమె తన దుకాణంలోని కొన్ని స్వీట్ల పేర్లను మార్చేశారు.దుకాణం యజమాని అంజలీ జైన్ మాట్లాడుతూ, "దేశభక్తి కేవలం సరిహద్దుల్లో సైనికులకే పరిమితం కాదు. ప్రతి పౌరుడిలోనూ దేశం పట్ల ప్రేమ ఉండాలి. అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం" అని తెలిపారు.వాస్తవానికి, 'పాక్' అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. దీనికి 'వండటం' లేదా 'పాకం పట్టడం' అని అర్థం. చక్కెర లేదా బెల్లంతో చేసే తీపి పదార్థాలను కొన్ని భాషల్లో పాకం అంటారు. ఈ పదానికి పాకిస్థాన్ దేశంతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ, పలికేటప్పుడు ఆ దేశం పేరును గుర్తుకు తెస్తుండటంతోనే ఈ మార్పు చేసినట్లు అంజలీ జైన్ వివరించారు. 'శ్రీ' అనే పదం శుభానికి, సౌభాగ్యానికి సూచిక కాబట్టి ఆ పదాన్ని చేర్చినట్లు పేర్కొన్నారు.
Latest News