కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన
 

by Suryaa Desk | Fri, May 23, 2025, 05:26 PM

కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

రాజస్థాన్‌లోని కోచింగ్ హబ్ అయిన కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పరిస్థితిని 'తీవ్రమైనది'గా అభివర్ణించింది. ఈ ఏడాది కోటాలో ఇప్పటికే 14 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.జస్టిస్ జేబీ పర్డీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌ల ధర్మాసనం శుక్రవారం ఈ అంశాన్ని విచారించింది. "ఒక రాష్ట్రంగా మీరేం చేస్తున్నారు కేవలం కోటాలోనే ఈ పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదా" అంటూ జస్టిస్ పర్డీవాలా రాజస్థాన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది, ఆత్మహత్యల ఘటనలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే, విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి జాతీయ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని మార్చి 24న ఇచ్చిన తీర్పును ధర్మాసనం గుర్తుచేసింది. సిట్ నివేదికకు సమయం పడుతుందని, ఆలోగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండరాదని హితవు పలికింది.ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రెండు కేసులను పరిశీలించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి మృతి కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదులో నాలుగు రోజుల జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. "ఇలాంటి విషయాలను తేలిగ్గా తీసుకోవద్దు. సంబంధిత పోలీస్ అధికారిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునేవాళ్లం" అని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్ నమోదై దర్యాప్తు జరుగుతుండటంతో, దర్యాప్తు వేగంగా, సరైన దిశలో సాగాలని సూచించింది.కోటాలో నీట్ ఆశావహ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "మీరు మా తీర్పును ధిక్కరిస్తున్నారు. ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు అని ప్రభుత్వాన్ని నిలదీసింది. విద్యార్థిని తల్లిదండ్రులతో ఉన్నా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయడం పోలీసుల విధి అని, ఈ విషయంలో సంబంధిత పోలీస్ అధికారి విఫలమయ్యారని ధర్మాసనం స్పష్టం చేసింది.ఈ వైఫల్యంపై వివరణకు, జూలై 14న తమ ముందు హాజరుకావాలని కోటాకు చెందిన సంబంధిత పోలీసు అధికారిని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిర్లక్ష్యాన్ని వీడి, విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తక్షణ పటిష్ట చర్యలు చేపట్టాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం రాజస్థాన్ ప్రభుత్వానికి కఠిన ఆదేశాలిచ్చింది.

Latest News
India has never seen shortage of fuels: Hardeep Puri Sun, Jul 06, 2025, 06:14 PM
Amit Shah backs Gujarat's salt cooperatives, applauds Amul’s expanding legacy Sun, Jul 06, 2025, 06:02 PM
LG Electronics to work with Saudi Arabia to develop HVAC solutions Sun, Jul 06, 2025, 05:50 PM
Odisha: Puri witnesses huge influx of devotees on 'Suna Besha' Sun, Jul 06, 2025, 05:45 PM
2nd Test: Start of day five play delayed due to heavy rain at Edgbaston Sun, Jul 06, 2025, 05:41 PM