పుణెలో హిందూ, ముస్లిం కుటుంబాల పెళ్లి వేడుకలు
 

by Suryaa Desk | Fri, May 23, 2025, 08:02 AM

పుణెలో హిందూ, ముస్లిం కుటుంబాల పెళ్లి వేడుకలు

పుణెలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అనుకోకుండా కురిసిన భారీ వర్షం కారణంగా హిందూ, ముస్లిం మతాలకు చెందిన రెండు వివాహ వేడుకలు ఒకే వేదికపై జరగడం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఇబ్బందుల్లో ఉన్న హిందూ కుటుంబానికి ముస్లిం కుటుంబం సాయం చేసి, తమ వివాహ వేదికను పంచుకోవడంతో ఈ అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది.పుణెలోని వాన్‌వాడీ ప్రాంతంలో ఉన్న అలంకారణ్‌ లాన్స్‌లో వేర్వేరు మతాలకు చెందిన రెండు కుటుంబాలు తమ పిల్లల పెళ్లి వేడుకలను ఏర్పాటు చేసుకున్నాయి. లాన్స్‌లోని బాంక్వెట్ హాల్‌లో ఒక ముస్లిం జంట వివాహ రిసెప్షన్‌ జరుగుతుండగా, అదే ప్రాంగణంలోని ఆరుబయట మరో హిందూ కుటుంబం తమ వారి వివాహం కోసం పందిరి వేశారు. హిందూ వివాహానికి సాయంత్రం ఏడు గంటలకు ముహూర్తం నిశ్చయించారు.అయితే, ముహూర్తం సమయం దగ్గరపడుతున్న కొద్దీ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. దీంతో ఆరుబయట ఏర్పాటు చేసిన హిందూ వివాహ వేదిక మొత్తం తడిసి ముద్దయింది. శుభకార్యానికి అంతరాయం కలగడంతో హిందూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. కాసేపు వర్షం తగ్గుతుందేమోనని ఎదురుచూసినా ఫలితం లేకపోయింది.ఈ క్లిష్ట సమయంలో, పక్కనే బాంక్వెట్ హాల్‌లో తమ వివాహ రిసెప్షన్ జరుపుకుంటున్న ముస్లిం కుటుంబ సభ్యులను హిందూ కుటుంబీకులు సంప్రదించారు. తమ ఇబ్బందిని వివరించి, వివాహ క్రతువును హాల్‌లో జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. వారి విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన ముస్లిం కుటుంబం, తమ వేదికను పంచుకోవడానికి సంతోషంగా అంగీకరించింది. అంతేకాకుండా, హిందూ వివాహానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలోనూ చురుగ్గా సాయపడ్డారు.వారి సహకారంతో హిందూ వివాహం వారి సంప్రదాయాల ప్రకారం సకాలంలో పూర్తయింది. అనంతరం, ఇరు కుటుంబాల వారు కలిసి విందు ఆరగించారు. ఈ అరుదైన వేడుకకు గుర్తుగా, రెండు నూతన జంటలు ఒకే వేదికపై కలిసి ఫొటోలు దిగడం అక్కడున్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సంఘటనతో ఇరు కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఆపద సమయంలో ఒకరికొకరు అండగా నిలవడం, మతాలకు అతీతంగా మానవత్వాన్ని చాటడం ద్వారా ఈ రెండు కుటుంబాలు సమాజానికి ఆదర్శంగా నిలిచాయని పలువురు ప్రశంసించారు.

Latest News
Nipah positive patient in critical condition, says Kerala Health Minister Mon, Jul 07, 2025, 01:16 PM
Congress youth wing launches legal offensive over 'vulgar propaganda' against Rahul Gandhi Mon, Jul 07, 2025, 01:11 PM
PM Modi, Malaysian counterpart review progress in bilateral ties Mon, Jul 07, 2025, 01:09 PM
TN's Lower Bhavani Project canal renovation nears completion, water release likely after August 15 Mon, Jul 07, 2025, 01:08 PM
No country should weaponise critical minerals, technology or supply chain, says PM Modi Mon, Jul 07, 2025, 01:02 PM