![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:55 PM
డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియా ప్రతినిధిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైట్‌హౌస్‌లో బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఖతార్ నుంచి అమెరికా వాయుసేనకు అందిన బోయింగ్ 747 విమానం గురించి ప్రశ్నించిన ఎన్బీసీ రిపోర్టర్‌పై ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయులైన రైతులపై జరుగుతున్న హింసకు సంబంధించిన ఓ వీడియోను రమఫోసాకు ట్రంప్ చూపించారు. ఆ తర్వాత ఎన్బీసీ విలేకరి (పీటర్ అలెగ్జాండర్ అని భావిస్తున్నారు) ఖతార్ విమానం గురించి ప్రశ్నించడంతో ట్రంప్ ఒక్కసారిగా మండిపడ్డారు. "దేని గురించి మాట్లాడుతున్నావ్? నువ్వు ఇక్కడ నుంచి బయటకు పో" అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు."ఖతార్ విమానానికి దీనికి ఏం సంబంధం? వాళ్లు అమెరికా వాయుసేనకు ఓ విమానాన్ని ఇస్తున్నారు. అది గొప్ప విషయం. మనం అనేక ఇతర విషయాల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడే చూసిన విషయం నుంచి దారి మళ్లించేందుకు ఎన్బీసీ ప్రయత్నిస్తోంది" అని ట్రంప్ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా, ఆ రిపోర్టర్ తెలివితేటలను, ఎన్బీసీ యాజమాన్యాన్ని కూడా తీవ్రంగా విమర్శించారు. "నువ్వో పనికిమాలిన రిపోర్టర్‌వి. రిపోర్టర్‌గా ఉండటానికి నీకు అర్హత లేదు. నీకు అంత తెలివి లేదు" అని అన్నారు. "ఎన్బీసీలో నీ స్టూడియోకి తిరిగి వెళ్లు. ఎందుకంటే బ్రయాన్ రాబర్ట్స్, ఆ సంస్థను నడుపుతున్న వారిపై విచారణ జరపాలి. నీ నుంచి ఇంకేం ప్రశ్నలు వద్దు" అంటూ సమావేశాన్ని ముగించారు.
Latest News