![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:47 PM
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక సమయంలో ఒక ముఖ్యమైన మార్పు చోటుచేసుకుంది. జట్టులోని ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. అతని స్థానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్-బ్యాటర్ టిమ్ సీఫెర్ట్‌ను ఆర్సీబీ యాజమాన్యం జట్టులోకి తీసుకుంది.భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ షెడ్యూల్ ఒక వారం పాటు వాయిదా పడి, అనంతరం పునఃప్రారంభమైనప్పుడు కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ షెడ్యూల్ మార్పుల ప్రభావం ఇప్పుడు ప్లేఆఫ్స్‌పై పడింది.మే 29 నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుండటంతో, జాకబ్ బెతెల్ తన జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఈ కారణంగా అతను ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు దూరం కానున్నాడు. మే 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే లీగ్ మ్యాచ్ ఈ సీజన్‌లో బెతెల్‌కు చివరిది కానుంది. ఆ తర్వాత, మే 24న అతను స్వదేశానికి బయలుదేరి ఇంగ్లండ్ జట్టుతో కలవనున్నాడు.జాకబ్ బెతెల్ స్థానంలో టిమ్ సీఫెర్ట్‌ను తీసుకుంటున్నట్లు ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. సీఫెర్ట్‌కు రూ. 2 కోట్ల చెల్లించనుంది. ఈ ఒప్పందం మే 24 నుంచి అమల్లోకి రానుంది. టిమ్ సీఫెర్ట్ ఇప్పటివరకు 66 టీ20 మ్యాచ్‌లు ఆడి 1,540 పరుగులు సాధించాడు. గతంలో 2022 ఐపీఎల్ సీజన్‌లో అతను మూడు మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా ఉంది. మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆర్సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టిమ్ సీఫెర్ట్ ఆర్సీబీ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ పరిణామం ఆర్సీబీ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇటీవల పాకిస్థాన్ తో వైట్ బాల్ క్రికెట్లో సీఫెర్ట్ అదరగొట్టాడు. ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరగనున్న సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు) ప్రభావం ఆర్సీబీపైనే కాకుండా మరో జట్టుపైనా పడింది. గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిద్యం వహిస్తున్న మరో కీలక ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ కూడా ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు.
Latest News