![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:38 PM
హమాస్ కీలక నేత మొహమ్మద్ సిన్వర్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) జరిపిన దాడుల్లో మరణించి ఉండవచ్చని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు ఐదు నెలల విరామం తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది మే నెల ఆరంభంలో దక్షిణ గాజాలోని ఓ ఆసుపత్రి లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల సమయంలోనే మొహమ్మద్ సిన్వర్ మరణించి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలను హమాస్ సంస్థ ఇంతవరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. గతంలో హమాస్ నేత యాహ్యా సిన్వర్ హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన సోదరుడైన మొహమ్మద్ సిన్వర్, ఆ తర్వాత గాజాలో హమాస్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు మొహమ్మద్ సిన్వర్ కూడా మరణించినట్లు నెతన్యాహు చేసిన ప్రకటనతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.జెరూసలేంలో జరిగిన మీడియా సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ, ఇప్పటివరకు సుమారు 10,000 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. హనియే, యాహ్యా సిన్వర్ వంటి కీలక హంతకులను కూడా తాము అంతమొందించామని ఆయన గుర్తుచేశారు. తాజాగా మొహమ్మద్ సిన్వర్ కూడా హతమై ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గాజాపై పూర్తి నియంత్రణ సాధించే వరకు సైనిక కార్యకలాపాలు కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టం చేశారు.
Latest News