ఛత్తీస్‌గఢ్‌ లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు
 

by Suryaa Desk | Thu, May 22, 2025, 05:41 PM

ఛత్తీస్‌గఢ్‌ లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా, నిన్న నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా మృతి చెందాడు. అలాగే, బాపట్ల జిల్లాకు చెందినట్లుగా భావిస్తున్న మరో కీలక నేత సజ్జ నాగేశ్వరరావు కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే, మృతదేహాలను గుర్తించి, పోస్టుమార్టం నిర్వహించిన తర్వాతే ఈ విషయంపై అధికారిక స్పష్టత రానుంది. ఈ ఘటనలో గాయపడిన రమేష్ అనే జవాను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో, మొత్తం ఇద్దరు జవాన్లు మరణం అబూజ్‌మాడ్ ఘటన స్థలంలో భద్రతా బలగాలు ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. గాయపడి తప్పించుకున్న మావోయిస్టుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడం, భారీ వర్షం కురుస్తుండటంతో మృతదేహాలను తరలించే ప్రక్రియ ఆలస్యమవుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి. కొన్ని మృతదేహాలను మాత్రమే నారాయణ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. మృతుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత, వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.కర్రె గుట్టలో సుమారు 24 రోజుల క్రితం జరిగిన ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మరణించినప్పటికీ, అగ్రనేతలు తప్పించుకున్నారు. దీంతో, అబూజ్‌మాడ్‌ను సురక్షిత ప్రాంతంగా భావించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు నంబాల కేశవరావు నేతృత్వంలో కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో స్థాయి నేతలు సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఈ పక్కా సమాచారంతోనే భద్రతా బలగాలు మూడు రోజులుగా వ్యూహాత్మకంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దాడి చేశాయి. మావోయిస్టులకు మూడు నుంచి నాలుగు అంచెల భద్రత ఉన్నప్పటికీ, బలగాలు వారిని ఛేదించి భారీ విజయం సాధించాయని తెలుస్తోంది. ఈ ఆపరేషన్ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, హోంమంత్రి భద్రతా బలగాలను అభినందించారు. అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Latest News
Bomb threats at four places in Hyderabad, searches on Tue, Jul 08, 2025, 03:45 PM
MCX to launch electricity futures contract starting July 10 Tue, Jul 08, 2025, 03:37 PM
Japan PM Ishiba calls Trump's new tariff decision 'truly regrettable' Tue, Jul 08, 2025, 03:03 PM
Shadab Khan, Haris Rauf to miss Bangladesh T20Is due to injuries Tue, Jul 08, 2025, 02:55 PM
AAIB submits preliminary report on Air India plane crash Tue, Jul 08, 2025, 02:47 PM