గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు బెయిల్
 

by Suryaa Desk | Tue, May 20, 2025, 08:47 PM

విదేశీ పర్యటనల పేరుతో వెళ్లి.. అక్కడి నుంచి అక్రమ మార్గాల్లో బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యారావుకు బెయిల్ వచ్చినా.. ఊరట మాత్రం కలగలేదు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్పెషల్ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను రన్యారావుకు మంజూరు చేసినప్పటికీ.. ఆమె జైలు నుంచి విడుదల కాలేదు. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం (కాఫిఫోసా చట్టం) కింద ఆమెపై నమోదైన కేసులో ఇంకా బెయిల్ రాకపోవడంతో రన్యారావును జైలు నుంచి విడుదల చేయలేదు. ఇక ఈ కాఫిఫోసా చట్టం కింద అరెస్ట్ అయిన వారికి ఏడాది పాటు బెయిల్ లభించే అవకాశం ఉండదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. దీంతో మరికొన్ని నెలల పాటు రన్యారావు జైలులోనే ఉండాల్సి ఉంటుందని తెలిపారు.


బంగారం స్మగ్లింగ్ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఛార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలం కావడంతో.. ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు రన్యారావుతో పాటు ఈ కేసులో మరో నిందితుడు తరుణ్ కొండూరు రాజుకు బెయిల్ ఇచ్చింది. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై వీరిద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. అయితే దేశం విడిచి వెళ్లకూడదని.. విచారణకు సహకరించాలని.. సాక్ష్యాలను ప్రభావితం చేయకుండా ఉండాలని బెయిల్ సందర్భంగా కోర్టు షరతులు విధించింది.


దుబాయ్ నుంచి భారీగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ.. కొన్ని రోజుల క్రితం రన్యారావు బెంగళూరు ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్ద నుంచి సుమారు రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఇంత భారీ మొత్తంలో బంగారం పట్టుబడటం అదే కావడం ఈ కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అంతేకాకుండా ఆ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో చాలా మంది పెద్ద పెద్ద నేతలు ఉన్నట్లు వార్తలు రావడం తీవ్ర దుమారం రేపింది. రన్యారావు దుబాయ్‌కు తరచూ వెళ్లి వచ్చేదని.. సుమారు 30 సార్లకు పైగా ప్రయాణాలు చేసినట్లు డీఆర్ఐ విచారణలో తేలింది. కిలో బంగారం స్మగ్లింగ్ చేసినందుకు రన్యారావు రూ.లక్ష కమీషన్ తీసుకునేదని.. కొన్ని నివేదికల ప్రకారం ఈ మొత్తం రూ. 4-5 లక్షల వరకు కూడా ఉండవచ్చని తెలుస్తోంది.


ఈ కేసులో రన్యారావు ఇంటిపై అధికారులు సోదాలు చేసి భారీగా బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ.2 కోట్ల విలువైన బంగారు నగలతోపాటు రూ. 2.67 కోట్ల నగదు కూడా డీఆర్ఐ అధికారులకు దొరికింది. ఈ కేసులో జువెలరీ వ్యాపారి సాహిల్ జైన్ మూడో నిందితుడిగా ఉన్నాడు. ఇతను హవాలా లావాదేవీలలో రన్యారావుకు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో రన్యారావు సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు పాత్ర ఉందని ఆరోపణలు రాగా.. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రకటించారు.


కాఫిఫోసా చట్టం అంటే ఏమిటి?


బంగారం అక్రమ రవాణా కేసుల్లో నిందితులు దర్యాప్తుకు సహకరించకపోతే లేదా పదే పదే బెయిల్ కోసం ప్రయత్నిస్తే.. వారిపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు కాఫిఫోసా చట్టం  కింద కేసు నమోదు చేస్తాయి. ఈ చట్టం ప్రకారం నిందితులను ఏడాది పాటు బెయిల్ లేకుండా నిర్బంధించే అధికారం అధికారులకు ఉంటుంది. రన్యారావు విషయంలో ఆమె దర్యాప్తుకు సహకరించడం లేదని, విడుదల చేస్తే మళ్లీ అక్రమ కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని డీఆర్ఐ అధికారులు కోర్టుకు విన్నవించారు. కాఫిఫోసా చట్టం కింద తన కుమార్తె నిర్బంధాన్ని సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టులో రన్యారావు తల్లి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జూన్ 3వ తేదీకి వాయిదా పడింది. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నాయి.

Latest News
Pakistani forces accused of extrajudicially killing three civilians in Balochistan: Rights Body Mon, May 04, 2026, 02:11 PM
Kerala Polls: Chandy Oommen's bicycle campaign rides into history Mon, May 04, 2026, 02:09 PM
'Trinamool will have the last laugh': Mamata Banerjee's new message to her party workers Mon, May 04, 2026, 01:45 PM
Politics of violence, appeasement coming to an end in Bengal: Swati Maliwal on BJP's lead Mon, May 04, 2026, 01:37 PM
Credential theft surges as Indian IT firms see 265.52 mn detections: Report Mon, May 04, 2026, 01:31 PM