|
|
by Suryaa Desk | Sun, May 18, 2025, 12:07 PM
అక్రమ కేసులతో వైయస్ఆర్‌సీపీని అణిచివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటే మరింత బలోపేతం అవుతామని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు హెచ్చరించారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ వంటి తప్పుడు కేసులతో భయపెట్టాలనుకోవడం చంద్రబాబు అవివేకమని అన్నారు. వైయస్ జగన్ లక్ష్యంగానే ఈ లిక్కర్ స్కామ్‌ను సృష్టించారని, ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను దీనిలో ఇరికించి అరెస్ట్‌లు చేయడం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అని మండిపడ్డారు. చంద్రబాబు ఏడాది పాలనలో కక్షసాధింపు మాత్రమే మిగిలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన మాట్లాడుతూ.... కూటమి ప్రభుత్వ ఏడాది కాలంలో చంద్రబాబు ఇచ్చిన ఏ వాగ్ధానాన్ని అమలు చేయలేదు. పైగా వైయస్ఆర్‌సీపీ పై కక్షసాధింపులతో కుట్రలు పన్నారు. చాలా సందర్భాల్లో కూటమి పార్టీల నేతలు వైయస్ఆర్‌సీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయంటూ విమర్శించారు. కానీ పదకొండు సీట్లు వచ్చిన వైయస్ఆర్‌సీపీని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు పార్టీని అణిచివేయాలని తహతహలాడుతున్నారు? ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఇందుకోసం ఏం చేసిందో అందరికీ తెలుసు. అనేక మందిపై తప్పుడు కేసులు పెట్టారు. తాజాగా మరో దుర్మార్గమైన కార్యక్రమానికి తెర తీశారు. లిక్కర్ స్కామ్ అంటూ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మరో అధికారి కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు. చంద్రబాబు హయాంలో కూడా ధనుంజయరెడ్డి కీలక స్థానాల్లో పనిచేశారు. జగన్ గారి ప్రభుత్వంలో సీఎంఓలో పనిచేశారనే కారణంతోనే ఆయనను, ఓఎస్‌డీగా పనిచేశారని కృష్ణమోహన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. అంతకు ముందు వికాట్ సంస్థకు చెందిన డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది కాలంగా చంద్రబాబు, లోకేష్‌లు చేస్తున్నది ఈ అరెస్ట్‌లే అని తెలిపారు.
Latest News